కలం, మధిర: ఖమ్మం జిల్లా మధిర ఆర్టీసీ బస్టాండ్లో(Madhira Depot) అధికారుల సమన్వయ లోపం ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. శుక్రవారం విజయవాడ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న బస్సును ప్రయాణికులు ఎక్కారు. అయితే బస్సు బయలుదేరి వైఎస్ఆర్ సర్కిల్ వద్దకు చేరుకోగానే.. ఈ బస్సు విజయవాడకు కాకుండా హైదరాబాద్కు వెళ్లాలంటూ డిపో నుంచి డ్రైవర్, కండక్టర్కు హఠాత్తుగా ఆదేశాలు అందాయి. దీంతో బస్సును వెనక్కి మళ్లించి డిపోకు తీసుకెళ్లడంతో ప్రయాణికులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. ముందు విజయవాడ బోర్డు పెట్టి, ఇప్పుడు హైదరాబాద్ అనడమేమిటంటూ వారు సిబ్బందిని నిలదీశారు.
మరోవైపు, సాధారణ పల్లె వెలుగు బస్సుకు ఎక్స్ప్రెస్ బోర్డు తగిలించి అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా ప్రయాణికుల్లో ఆగ్రహం తెప్పించాయి. ముందస్తు సమాచారం లేకుండా సర్వీసును మార్చడం, అదనపు వసూళ్లపై అధికారులు స్పందించి సమగ్ర విచారణ జరపాలని, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.

