Mobile Popup Ad
Mobile Popup Ad

మొక్కజొన్న కొనుగోళ్ల‌ను త‌నిఖీ చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) జిల్లా మోపాల్ మండలం శ్రీరాంనగర్ తండాలో మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) గురువారం తనిఖీ చేశారు. నిజామాబాద్ రూరల్ మండలం శ్రీనగర్ శివారులోని గోడౌన్‌ను సైతం కలెక్టర్ సందర్శించారు. ముందుగా కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసి, రైతులకు అందుబాటులో ఉన్న సదుపాయాల‌ను పరిశీలించారు. మొక్కజొన్న పంట నాణ్యత, తేమ శాతాన్ని స్వయంగా పరిశీలించిన కలెక్టర్, ఎలక్ట్రానిక్ వేయింగ్ మెషీన్ ద్వారా తూకం సరిగా చేస్తున్నారా లేదా అన్నది గమనించారు. ఇప్పటి వరకు ఎన్ని క్వింటాళ్ల మొక్కజొన్న కొనుగోలు పూర్తయ్యింది, ఇంకా ఎంత పరిమాణంలో పంట సేకరణ జరగాల్సి ఉన్నదని తదితర వివరాలు అడిగి తెలుసుకుని, అధికారులకు సూచనలు చేశారు. రైతులు పంట ఉత్పత్తులు కేంద్రానికి తెచ్చిన వెంటనే నాణ్యతా ప్రమాణాలకు లోబడి ఉంటే వెంటనే తూకం వేయించాలన్నారు. సేకరించిన పంటను వెంట వెంటనే గోడౌన్లకు తరలించాలని ఆదేశించారు.

అకాల వర్షాలు కురిస్తే ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉన్నందున త్వరితగతిన మొక్కజొన్న నిల్వలను గోడౌన్లకు తరలించి జాగ్రత్తగా భద్రపరచాలని ఆదేశించారు. అవసరమైన సంఖ్యలో హమాలీలను సమకూర్చుకొని, మొక్కజొన్న రవాణాలో జాప్యానికి తావులేకుండా సరిపడా లారీలు అందుబాటులో ఉండేలా ప్రణాళికాబద్దంగా వ్యవహరించాలని సూచించారు. రైతులకు నిర్దిష్ట గడువు లోపు బిల్లుల చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. రైతులకు ఏ దశలోనూ అసౌకర్యం కలగకుండా చూడటం అధికారుల బాధ్యత అని అన్నారు. అనంతరం శ్రీనగర్‌లోని గోడౌన్‌ను కలెక్టర్ సందర్శించారు. మొక్కజొన్న నిల్వల అన్ లోడింగ్ తీరును, మొక్కజొన్న బస్తాలను భద్రపరుస్తున్న విధానాన్ని పరిశీలించారు. గోడౌన్‌లో పూర్తి సామర్థ్యం మేరకు పంటను నిల్వ చేయాలని, పంటకు ఎలాంటి నష్టం కలుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లారీలు, ఇతర రవాణా వాహనాలను వెంటనే ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను, ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. పూర్తి పారదర్శకంగా, వేగవంతంగా కొనుగోళ్లను పూర్తి చేసేందుకు సంబంధిత అధికారులు, సిబ్బంది సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ రేఖా నాయక్, ఎంపీడీఓ నరేష్, మార్క్ ఫెడ్ సిబ్బంది భాస్కర్, తదితరులు ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>