కలం, హనుమకొండ: కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై పట్టభద్రులు, మేధావుల్లో వ్యతిరేకత కనిపిస్తోందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ (Boinapally Vinod Kumar) అన్నారు. వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం ఆదివారం హనుమకొండలో నిర్వహించారు. ఈ సమావేశానికి వినోద్ కుమార్, మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, పలువురు పార్టీ నేతలు హాజరయ్యారు.
గోదావరి జలాల వినియోగంలో విఫలం..
ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమాన్ని పక్కనపెట్టి సీఎం రేవంత్‌రెడ్డి.. కేసీఆర్, కేటీఆర్ కుటుంబంపై విమర్శలకే ప్రాధాన్యమిస్తున్నారని ఆరోపించారు. గోదావరి జలాల వినియోగంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కన్నెపల్లి పంప్‌హౌస్ సమీపంలో 1.8 టీఎంసీల నీరు ప్రవహించినా వినియోగించుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు, అన్నారం, ఎల్లంపల్లి, కాకతీయ కాలువల అనుసంధాన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.

