కాళేశ్వరంపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం : గణేష్ బిగాల

కలం, నిజామాబాద్ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) పై పీసీ ఘోష్ కమిషన్ నివేదికకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల (Bigala Ganesh) స్వాగతించారు. నిజామాబాద్‌ (Nizamabad) లో గణేష్ బిగాల మీడియా సమావేశం నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించడం ద్వారా న్యాయం గెలిచిందని హర్షం వ్యక్తం చేశారు. కమిషన్ విచారణలో ప్రాథమిక నిబంధనలు పాటించలేదని కోర్టు స్పష్టం చేయడం ద్వారా ఆ నివేదికకు చట్టపరమైన ప్రాముఖ్యత లేదని తేలిందని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యంగా సెక్షన్–8 కింద సంబంధిత వ్యక్తులకు నోటీసులు ఇవ్వకుండా ఆరోపణలు చేయడం సరికాదని కోర్టు వ్యాఖ్యానించడం అత్యంత కీలకమని అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులపై రాజకీయంగా ఒత్తిడి తేవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కమిషన్‌లను అడ్డంపెట్టుకుని వేధింపులకు పాల్పడిందని విమర్శించారు.

న్యాయస్థానాలపై నమ్మకంతో పోరాడగా, చివరకు నిజం గెలిచిందని సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ జీవధారగా భావించే కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ పార్టీ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్, బీజేపీలు కక్షపూరితంగా వ్యవహరించాయని విమర్శించారు. ప్రాజెక్టు మరమ్మతులను సకాలంలో చేపట్టకుండా దాదాపు రెండున్నరేళ్లు ఆలస్యం చేశారని, చివరకు గత్యంతరం లేక ఇప్పుడు పనులు చేపడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. కాళేశ్వరం విషయంలో కేసీఆర్ పై చేసిన ఆరోపణలు నిరాధారమని ఈ తీర్పుతో స్పష్టమైందని, కాంగ్రెస్ బీజేపీలకు ఈ తీర్పుతో ఇకనైనా కనువిప్పు కలగాలని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ వేధింపులను పక్కన పెట్టి పాలనపై దృష్టి సారించి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని గణేష్ బిగాల డిమాండ్ చేశారు. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుందనే విశ్వాసానికి ఈ హైకోర్టు తీర్పు నిదర్శనమని అన్నారు. ఈ ప్రెస్ మీట్‌లో మాజీ ఎమ్మెల్సీ VG గౌడ్, మాజీ మేయర్ దండు నీతుకిరణ్ శేఖర్, పార్టీ నగర అధ్యక్షులు సిర్ప రాజు, మాజీ NUDA చైర్మెన్ ప్రభాకర్ రెడ్డి, సుజిత్ సింగ్, నవీద్ ఇక్బాల్, గాండ్ల లింగం, మతీన్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>