కలం, వెబ్ డెస్క్ : కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలని ఢిల్లీలో బీసీ సంఘాలు మెరుపు ధర్నా (BC Leaders Protest) నిర్వహించాయి. డీలిమిటేషన్ పత్రాలను చింపివేసి నిరసనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ వీహెచ్, బీఆర్ఎస్ నేతలు మధుసూదనాచారి, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. నియోజకవర్గాల పునర్విభజన వల్ల బీసీలకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. పెంచిన అసెంబ్లీ పార్లమెంటు స్థానాలు మహిళల పేరుతో మళ్లీ అగ్రకులాలకు దక్కుతాయని ఆయన ఆరోపించారు. దేశవ్యాప్తంగా బీసీ కులగనణన పూర్తి చేసిన తరువాత జనాభా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు. మహిళా బిల్లులో బీసీ మహిళకు సబ్ కోట కల్పించాలన్నారు. మహిళా బిల్లు, డీలిమిటేషన్ బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే దేశవ్యాప్త బంద్ నిర్వహిస్తామని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.
బీసీ వర్గానికి చెందిన మోడీ ప్రధాన మంత్రి అయి ఉండి బీసీలకే ద్రోహం చేస్తున్నారని మాజీ ఎంపీ వీహెచ్ విమర్శించారు. మహిళా బిల్లులో బీసీ సబ్ కోట కల్పించకపోతే బీజేపీని బీసీలు క్షమించరన్నారు. బీజేపీ బీసీలకు చేస్తున్న మోసంపై ఊరూరా తిరిగి ప్రచారం చేస్తాన్నారు వీహెచ్. అనంతరం, మధుసూదనాచారి, శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. మహిళా బిల్లు పేరుతో బీసీలను రాజకీయంగా తొక్కి పెట్టాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. దేశంలోని 40 కోట్ల మంది బీసీ మహిళల ఆక్రందనను కేంద్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థలలో లాగానే చట్టసభల్లో కూడా బీసీ మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం పెంచకుండా నియోజకవర్గాల పునర్విభజన చట్టం రూపొందిస్తే ఉపయోగం లేదన్నారు. బీసీ హక్కుల సాధనకు బీసీ సంఘాలతో కలిసి దేశవ్యాప్తంగా పోరాడుతామని వారు స్పష్టం చేశారు.
దేశంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన వారిని పట్టించుకునే వారే లేని బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కేసిన శంకర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలు అంటే అన్ని పార్టీలకు చిన్న చూపు అని విమర్శించారు. వారి ఓట్ల మీద ఉన్న ప్రేమ వారికి కేటాయించాల్సిన సీట్ల మీద లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలను చేర్చకపోతే కేంద్రంపై తిరగబాటు చేస్తామని శంకర్ రావు హెచ్చరించారు.
Read Also: నాకు, ప్రధానికి ఆ సమస్య లేదు: రాహుల్ కామెంట్లతో లోక్‌సభలో నవ్వులు
Follow Us On: Instagram

