బ్యాడ్మింటన్‌‌కు విక్టర్ అక్సెల్సన్ గుడ్‌బై..!

క‌లం, వెబ్ డెస్క్‌: ప్రపంచ బ్యాడ్మింటన్ దిగ్గజం, డెన్మార్క్ స్టార్ ప్లేయర్ విక్టర్ అక్సెల్సన్ (Viktor Axelsen) తన కెరీర్‌ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. 32 సంవత్సరాలకే తన కెరీర్‌కు శుభంకార్డు వేయాలని డిసైడ్ అయ్యారు. గత కొంతకాలంగా వేధిస్తున్న వెన్నునొప్పి కారణంగానే బ్యాడ్మింటన్‌కు రిటైర్మెంట్ ఇవ్వాలన్న కఠిన నిర్ణయం తీసుకున్నట్లు బుధవారం వెల్లడించారు. అత్యున్నత స్థాయిలో శిక్షణ పొందడం, పోటీ పడటం తన శరీరానికి ఇక సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. గతేడాది ఏప్రిల్‌లో వెన్ను శస్త్రచికిత్స చేయించుకున్నప్పటికీ, మునుపటిలా రాణించలేకపోతున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

32 ఏళ్ల అక్సెల్సన్ కెరీర్ ఎంతో అద్భుతంగా సాగింది. టోక్యో (2021), పారిస్ (2024) ఒలింపిక్స్‌లో వరుసగా స్వర్ణ పతకాలు సాధించడమే కాకుండా, రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచారు. రియో 2016లో కాంస్య పతకాన్ని కూడా అందుకున్నారు. 6 అడుగుల 4 అంగుళాల పొడవున్న అక్సెల్సన్, తన అసాధారణమైన పవర్, వేగంతో పురుషుల సింగిల్స్‌లో ఒక కొత్త ఒరవడిని సృష్టించారు. దాదాపు 100 వారాల పాటు ప్రపంచ నంబర్ వన్ ర్యాంకులో కొనసాగి తన ఆధిపత్యాన్ని చాటుకున్నారు.

అక్సెల్సన్ రిటైర్మెంట్‌పై భారత స్టార్ ప్లేయర్ లక్ష్య సేన్ స్పందిస్తూ, ఆయనను ఆల్ టైమ్ గ్రేట్ ప్లేయర్‌గా అభివర్ణించారు. అక్సెల్సన్‌ కేవలం గొప్ప ఛాంపియన్ మాత్రమే కాదని, మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి అని కొనియాడారు. మాజీ కోచ్ విమల్ కుమార్ కూడా దీనిని బ్యాడ్మింటన్ రంగానికి తీరని లోటుగా పేర్కొన్నారు. చైనీస్ భాషలో అనర్గళంగా మాట్లాడగల అక్సెల్సన్, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన నిష్క్రమణతో బ్యాడ్మింటన్ ప్రపంచంలో ఒక గొప్ప శకం ముగిసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>