కలం, వెబ్ డెస్క్: ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ (AR Rahman) ఇటీవల చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్‌లో తీవ్రమైన దుమారం రేపాయి. బాలీవుడ్‌లో తనకు అవకాశాలు తగ్గడానికి మతతత్వం ఒక కారణమై ఉండొచ్చని రెహమాన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై రాజకీయ, సాంస్కృతిక వర్గాల నుంచి భిన్న స్పందనలు వెలువడుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై తాజాగా వీహెచ్‌పీ నేత వినోద్ బన్సల్ స్పందించారు. రెహమాన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఆయన, మతం పేరుతో బాలీవుడ్‌ను విమర్శించడం సరికాదన్నారు. అంతేకాకుండా, రెహమాన్ తిరిగి హిందూ మతంలోకి రావాలని సూచించారు.
రెహమాన్ (AR Rahman) ఆరోపణలను ప్రముఖ గేయ రచయిత జావేద్ అక్తర్ ఖండించారు. బాలీవుడ్‌లో అవకాశాలు ప్రతిభ ఆధారంగానే లభిస్తాయని, మతంతో సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇదే తరహాలో పలువురు నిర్మాతలు కూడా స్పందిస్తూ, రెహమాన్ వ్యాఖ్యల్లో వాస్తవం లేదని వ్యాఖ్యానించారు. మొత్తంగా రెహమాన్ వ్యాఖ్యలు బాలీవుడ్‌లో మతం–ప్రతిభ అంశంపై మరోసారి చర్చకు దారితీయగా, ఈ వివాదం ఇంకా ఎంతవరకు వెళ్తుందో చూడాల్సి ఉంది.


