కలం, వెబ్ డెస్క్: నేడు ఏపీ సీఎం చంద్రబాబు పుట్టిన రోజు (CM Chandrababu Birthday) సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కుటుంబసభ్యులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు చంద్రబాబుకు బర్త్‌డే విషెస్ చెప్తున్నారు. ముందుగా సీఎం సతీమణి, నారా భువనేశ్వరి ఎక్స్ వేదికగా చంద్రబాబుకు విషెస్ తెలిపారు. ప్రియమైన శ్రీవారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ స్పెషల్ పోస్ట్ చేశారు. ప్రతి పుట్టుకకు ఒక కారణం ఉందంటారని, అలా చంద్రబాబు పుట్టింది తెలుగు ప్రజల కోసమేనని పేర్కొన్నారు. పుట్టిన రోజు వేడుకల్లో ఆనందం కన్నా ప్రజల సేవలోనే ఆయనకు ఎక్కువ ఆనందం ఉంటుందని తెలిపారు. అంత ఇష్టమైన ప్రజల కోసం నిండు నూరేళ్లూ పూర్తి ఉత్సాహంతో, సంపూర్ణ శక్తితో, ఆరోగ్యంతో చంద్రబాబు వర్ధిల్లాలని కోరుకుంటున్నానని రాసుకొచ్చారు. అలాగే చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా భువనేశ్వరి రాష్ట్రంలోని అన్న క్యాంటీన్లకు భారీ విరాళం అందించారు. రూ.76 లక్షలకు సంబంధించిన చెక్కును క్యాంటీన్ల సీఈవోకు అందజేశారు. అన్న క్యాంటీన్లలో నేడు ఉచితంగా భోజనం అందించనున్నారు. ఈ రోజు ఉదయం 9.39 గంటలకు విజయవాడలోని పటమటలో ఉన్న అన్న క్యాంటీన్‌లో సీఎం చంద్రబాబు దంపతులు బ్రేక్‌ఫాస్ట్ చేయనున్నారు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా చంద్రబాబుకు విషెస్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అని, ఈ సందర్భం ఆయనకు ఆనందాన్ని తీసుకురావాలని, రాబోయే సంవత్సరం ఆరోగ్యం, శ్రేయస్సుతో నిండి ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ కూడా చంద్రబాబుకు విషెస్ తెలిపారు. భగవాన్ తిరుపతి బాలాజీ చంద్రబాబుకు మంచి ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్షును, సుసంపన్నమైన జీవితాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు.

