కలం, అచ్చంపేట: నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని అమ్రాబాద్ రైతులు (Amrabad Farmers),పదర మండలాల (అప్పర్ ప్లాట్ )కు 60 ఏళ్ల నుంచి సాగునీరు వస్తుందన్న విషయం కలగానే మిగిలిపోతుందని నల్లమల ప్రజలు మండిపడుతున్నారు. అందులో భాగంగానే శనివారం సాగునీటి జలసాధన కమిటీ, యురేనియం వ్యతిరేక కమిటీ, అప్ప ఫ్లాట్ రైతు కమిటీలు కలిసి ఉమ్మడిగా సాగునీటి కోసం ఐక్య పోరాటానికి సిద్ధమవుతున్నామని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అంగట్లో అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని అన్న చందంగా అమ్రాబాద్ ఉమ్మడి మండల ప్రజల పరిస్థితి ఉందన్నారు.మండల శివారులో చుట్టూ కృష్ణమ్మ పారుతున్న తమ పొలాలకు సాగునీరు అందడం లేదని రైతులు, స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .తమకు ఆరు దశాబ్దాలుగా నాయకులు ఎన్నికల ముందు వచ్చి హామీలలిచ్చి ఆ తరువాత గాలికి వదిలేస్తారని మీడియాతో వాపోయారు.
సుమారు 80 కిలోమీటర్ల పరిధిలో కృష్ణనీరు మండలంలో పారుతున్న మా పొలాలకు నీరేదని నిలదీయండి ?అని ప్రజలు గ్రామాల నుంచి వివిధ స్థాయిలో ఉన్న అన్ని పార్టీల నాయకులపై అగ్గి మీద గుగ్గిళం అవుతున్నారు.శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీరు ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నా, నది ఒడ్డున ఉన్న అమ్రాబాద్ ఉమ్మడి మండల రైతులకు మాత్రం సాగునీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెన్నైకితో పాటు,పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు కూడ నీరు తరలించే ప్రణాళికలు అమలవుతున్నాయి కానీ తమ ప్రాంత రైతుల సాగునీటి సమస్యకు మాత్రం శాశ్వత పరిష్కారం చూపడం లేదని ప్రశ్నించారు.ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ లు ఇద్దరు మా ప్రాంతమే అయినా వారికీ మా కరువు గోస కనిపించడం లేదా..?అని నిలదీస్తున్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇటీవల జరిగిన సాగునీటి సమీక్షలో ఇప్పటికే అధిక శాతం సాగునీటి సౌకర్యం ఉన్న నల్గొండ జిల్లా అంశాలపై దృష్టి సారిస్తున్నారని, తరతరాలుగా కరువుతో అల్లాడుతున్న అమ్రాబాద్ ఉమ్మడి మండలానికి సాగునీరు అందించే అంశానికి తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడం బాధాకరమని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు .ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యే ఇద్దరూ ఈ ప్రాంతానికి చెందినవారే అయినప్పటికీ, తమ ప్రాంత సాగునీటి సమస్యకు పరిష్కారం లభించకపోవడం ప్రజలను నిరాశకు గురిచేస్తోందన్నారు.
నాడు ఆంధ్ర పాలకుల వివక్ష అన్నారు.. నేడు తెలంగాణలోనూ అదే పరిస్థితా..?అంటూ ఉద్యమకారులు గుర్తుచేశారు. గతంలో దుందుభి వాగు, నక్కలగండి, నార్లాపూర్, ఏదుల వంటి ప్రాజెక్టులు, ప్రతిపాదనల పేర్లు వినిపించాయని, కాలం గడుస్తున్నా తమ ప్రాంతానికి సాగునీరు అందించే శాశ్వత పరిష్కారం మాత్రం కనిపించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.గతంలో సాగునీరు రాకపోవడానికి ఆంధ్ర పాలకుల వివక్ష కారణమని చెప్పారని, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, స్థానిక ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగాల్సిన సమయంలోనూ తమకు నీరు ఎందుకు రావడం లేదని నిలదీశారు. యురేనియం వ్యతిరేక పోరాటం తరహాలో సాగునీటి ఉద్యమం చేపడదాం!అమ్రాబాద్ ఉమ్మడి మండల ప్రజలు, రైతులు, యువకులు, ప్రజాసంఘాల నాయకులు రాజకీయాలకు అతీతంగా ఒక్కటై సాగునీటి హక్కుల కోసం మరో ప్రజా ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. యురేనియం వ్యతిరేక పోరాటంలో ప్రజలు ఏకమై తమ నిరసనను బలంగా వినిపించినట్లుగానే, సాగునీటి సాధన కోసం కూడా ఐక్యంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.ప్రభుత్వం తక్షణమే అమ్రాబాద్ ఉమ్మడి మండల సాగునీటి అవసరాలపై సమగ్ర ప్రణాళిక రూపొందించి, నిధులు కేటాయించి, ప్రాజెక్టుల పనులకు స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇకపై హామీలతో కాలయాపన చేయకుండా, తమకు సాగునీరు అందించే విషయంలో తాడోపేడో తేల్చుకునేలా ప్రజలంతా ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ సమావేశంలో జక్కా బాలకిష్టయ్య (అంబేద్కర్ సంఘం రాష్ట్ర కార్యదర్శి), తెలంగాణ జేఏసీ శ్రీనివాస్, విజయమోహన్, జక్కా బాలయ్య, సామ అనిల్, గాజుల చిన్నకిష్టయ్య, రైతులు జక్కా రామయ్య, రంగయ్య తదితరులు పాల్గొన్నారు.

