కలం, జోగులాంబ గద్వాల: కేటిదొడ్డి మండలం గువ్వలదిన్నె (Guvvaladinne) గ్రామంలో ఉపాధి హామీ (వీబీజీ రామ్) పథకం ఫీల్డ్ అసిస్టెంట్ వీరన్నపై గ్రామస్తులు చేసిన అక్రమాల ఆరోపణలపై శనివారం అధికారులు స్పందించి విచారణ చేపట్టారు. ఉపాధి హామీ కూలీలకు సంబంధించి కొత్త జాబ్ కార్డుల మంజూరు కోసం ఫీల్డ్ అసిస్టెంట్ వీరన్న అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ గ్రామస్తులు ఇటీవల ఎంపీడీఓ రమణరావుకు ఫిర్యాదు చేశారు. అలాగే ఫారంఫండ్ లలో జేసీబీతో తవ్వించారని, రైతు అనుమతులు లేకుండా హార్టికల్చర్ పనులు చేయించాడని ఆరోపించారు.
గ్రామస్తుల ఫిర్యాదు మేరకు శనివారం ఎంపీడీఓ రమణరావు, ఎంపీఓ రామన్ గౌడ్ గువ్వలదిన్నె గ్రామానికి స్వయంగా వెళ్లి సమగ్ర విచారణ నిర్వహించారు. అలాగే టీఏ, ఏపీఓలపై ఆరాతీశారు. ఫీల్డ్ అసిస్టెంట్ అక్రమాల వెనుక వారి పాత్ర ఏమైన ఉందా అనే కోణంలో కూలీలను అడిగి తెలుసుకున్నారు. బాధితుల నుంచి వివరాలు సేకరించిన అనంతరం, విచారణ ప్రాథమిక నివేదిక ఆధారంగా అక్రమాలకు పాల్పడిన ఫీల్డ్ అసిస్టెంట్ వీరన్నకు మెమో జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ పథకాల అమలులో అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు.

