కలం, జగిత్యాల: వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని రైతులు అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని రైతులకు జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ (MLA Sanjay Kumar) సూచించారు. జగిత్యాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో శనివారం రూ.9 లక్షలతో కొనుగోలు చేసిన వ్యవసాయ డ్రోన్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. జగిత్యాల పీఏసీఎస్‌కు అనుభవజ్ఞులైన పాలకవర్గం ఉందని, రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు. పంటలకు డ్రోన్ ద్వారా మందులు పిచికారీ చేయడం వల్ల రైతులకు శారీరక శ్రమ తగ్గుతుందని, పురుగుమందుల ప్రత్యక్ష సంబంధం నుంచి కొంతవరకు దూరంగా ఉండే అవకాశం కలుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు.
జగిత్యాలకు ప్రత్యేక గుర్తింపు..
జగిత్యాల ప్రాంతానికి వ్యవసాయ రంగంలో చారిత్రక ప్రాధాన్యత ఉందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గుర్తు చేశారు. గతంలో నాలుగు ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన నీటిపారుదల శాఖ అధికారులు జగిత్యాల కేంద్రంగా వివిధ అంశాలపై చర్చించేవారని తెలిపారు. 1980కు ముందే చల్లిగల్, పొలాస వ్యవసాయ క్షేత్రాలు, అగ్రోస్ ఇండస్ట్రీస్ వంటి సంస్థలు ఈ ప్రాంతంలో ఉన్నాయని వివరించారు.
అయితే గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా జగిత్యాలలో ఉన్న పలు కీలక కార్యాలయాలు ఇతర ప్రాంతాలకు తరలిపోయాయని విమర్శించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాజంగి నందయ్య, పీఏసీఎస్ ఛైర్మన్ కొలుగూరి దామోదర్ రావు, మాజీ మున్సిపల్ ఛైర్మన్ గిరి నాగభూషణం, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గట్టు సతీష్, సీనియర్ నాయకులు బండ శంకర్, సమిండ్ల శ్రీనివాస్, అడువాల లక్ష్మణ్, సర్పంచి కట్ట రాజేందర్, మాజీ సర్పంచి అంకం సతీష్, మహేశ్వర్ రావు, గంగారాం, సీఈఓ వేణు పాల్గొన్నారు.

