కలం, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో శాంతి భద్రతలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) కీలక సమీక్ష నిర్వహించారు. ఢిల్లీ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో జరిగిన ఈ సమావేశంలో సీఎం రేఖా గుప్తాతో పాటు పోలీస్ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇటీవల జరిగిన ఆందోళనలపై ఆరా తీసిన అమిత్ షా.. భవిష్యత్తులో జరగబోయే నిరసనలకు సంబంధించిన సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. పోలీస్ అధికారులే కాకుండా నిఘా వర్గాల నుంచి వివరాలు తీసుకున్నారు. ఢిల్లీలో శాంతి భద్రతల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యంగా ఉండొద్దని.. కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.
అల్లర్లు సృష్టించే అవకాశం..
అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు అదనపు బలగాలను రంగంలోకి దించేందుకు కేంద్ర హోం శాఖ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని అమిత్ షా సూచించారు. ఆందోళనల ముసుగులో అసాంఘిక శక్తులు చొరబడి అల్లర్లు సృష్టించే అవకాశం ఉందని.. అలాంటి వారిపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టాలన్నారు. రాజధానిలో దాదాపు అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాల కవరేజీ ఉండేలా చూసుకోవాలన్నారు. ఇదిలా ఉంటే.. ఢిల్లీ భద్రతపై అమిత్ షా ఉన్నత స్థాయి సమీక్ష చేయడం ఇటీవల కాలంలో ఇదే మొదటిసారి.

