Mobile Popup Ad
Mobile Popup Ad

నిరుద్యోగ సమస్యలపై ఉద్యమాలకు సిద్ధం కావాలి: పంజాల శ్రీనివాస్

కలం, కరీంనగర్ బ్యూరో: యువజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై, హక్కుల సాధనకై అనునిత్యం పోరాటాలు చేయాలని సీపీఐ (CPI) జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఆదివారం అఖిల భారత యువజన సమాఖ్య (AIYF) కరీంనగర్ (Karimnagar) జిల్లా హుజురాబాద్ నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం ఇందిరానగర్ లో పోలోజు రంజిత్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు అన్ని వెంటనే భర్తీ చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఎన్నికల తర్వాత మాట తప్పిందని ఆయన విమర్శించారు.

గత ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని మేము వస్తే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని మాట ఇచ్చి తప్పిన కాంగ్రెస్ పార్టీపై పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన కోరారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం గత 12 సంవత్సరాలకు పైగా యువతను మోసం చేస్తూ వస్తుందని, ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ మాట ఎత్తకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఏటా కోటి ఉద్యోగాలన్న మోడీ నేటికీ దాన్ని అమలు పరచలేదని మండిపడ్డారు. వెంటనే యువజన వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉద్యమాలకు సిద్ధం కావాలని యువతకు పిలుపునిచ్చారు.

అఖిల భారత యువజన సమాఖ్య (AIYF) రాష్ట్ర సహాయ కార్యదర్శి భావండ్లపెల్లి యుగంధర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు నెలకు రూ. 3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి మాట తప్పిందని ఆరోపించారు. గతంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం కోసం లోన్లు ఇచ్చేవారని, ఇప్పుడు ఆ పథకాన్ని పూర్తిగా నీరు కార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నత చదువులు చదివినటువంటి యువతకు ఉద్యోగం, ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా యువతను మర్చిపోయాయని, అటువంటి ప్రభుత్వాల కళ్ళు తెరిపించేందుకు అఖిల భారత యువజన సమాఖ్య కార్యకర్తలు ఉద్యమాలకు సిద్ధం కావాలని యుగంధర్ పిలుపునిచ్చారు. ఏఐవైఎఫ్ ను హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రతీ గ్రామంలో బలోపేతం చేసి యువతను ఐక్యపరచి సంఘటిత పోరాటాలకు సిద్ధం చేయాలని యుగంధర్ కార్యకర్తలను కోరారు. ఈ సమావేశంలో AIYF మాజీ జిల్లా నాయకులు రత్నాకర్, AIYF నియోజకవర్గ నాయకులు జెట్టి లావణ్య, మొడెం శివకుమార్, ప్రశాంత్, రాకేష్, మహేందర్, శివకుమార్, సదానందం, ఫర్జానా, రామంచ శ్రావణ్, అకినపల్లి సందీప్, కోల సుమన్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>