గణేష్ ఉత్సవాలపై డీఎస్పీ కీలక సూచనలు

కలం, ఖమ్మం బ్యూరో :  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతమైన వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని కొత్తగూడెం డీఎస్పీ (Kothagudem DSP) ఆదినారాయణ (Adinarayana) పిలుపునిచ్చారు. గురువారం డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఉత్సవాల సందర్భంగా నిర్వాహకులు పోలీస్, మున్సిపల్ శాఖలు విధించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

​గణేష్ మండపాలను ప్రజా రవాణాకు, అత్యవసర వాహనాలకు ఎలాంటి ఆటంకం కలగని ప్రదేశాల్లో మాత్రమే పోలీస్, మున్సిపల్ ముందస్తు అనుమతులతో ఏర్పాటు చేయాలని సూచించారు. ఉత్సవాల్లో డీజేల వినియోగంపై పూర్తి నిషేధం ఉందని, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్‌స్పీకర్లు వాడకూడదని డీఎస్పీ స్పష్టం చేశారు. పెద్ద మండపాల వద్ద భద్రత కోసం సీసీ కెమెరాలు, అగ్నిప్రమాద నివారణకు ఫైర్ సేఫ్టీ పరికరాలు సిద్ధంగా ఉంచుకోవాలని, రాత్రి వేళల్లో వాలంటీర్లు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

​మండపాల వద్ద బలవంతపు చందాల వసూళ్లు, మద్యం సేవించడం, అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించడం లాంటివి చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిపారు. ఇతర మతాల ప్రార్థనా స్థలాల వద్ద వివాదాస్పద ఫ్లెక్సీలు పెట్టకుండా సామరస్యాన్ని పాటించాలని, వీలైనంత వరకు మట్టి విగ్రహాలనే ప్రతిష్టించాలని కోరారు. అత్యవసర సమయాలలో పోలీస్ (100), ఫైర్ (101), అంబులెన్స్ (108) నంబర్లను సంప్రదించాలని అన్నారు. ఈ సమావేశంలో త్రీ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి, ట్రాఫిక్ ఎస్‌హెచ్‌ఓ  ప్రవీణ్ కుమార్, ఎస్ఐ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>