కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నగరంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ ఉక్కుపాదం (ACB Raids) మోపుతోంది. ఖైరతాబాద్ జలమండలి(Water Board)లో అవినీతి బాగోతం వెలుగులోకి వచ్చింది. ఆఫీస్ నుంచి అక్రమ సంపాదనతో నేరుగా ఇంటికి వెళ్తున్న వాటర్ బోర్డు ఉన్నతాధికారి ఏసీబీ వలలో చిక్కారు. కార్యాలయ వేళలు ముగియగానే నడిరోడ్డుపై జరిగిన ఈ హైడ్రామా స్థానికంగా కలకలం రేపింది.
ఖైరతాబాద్‌లోని హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ (HMWS&SB) కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఎ. శ్రీనివాస్ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే పక్కా సమాచారంతో ఏసీబీ సిటీ రేంజ్-II బృందం నిఘా పెట్టింది. అక్టోబర్ 24 సాయంత్రం సమయంలో శ్రీనివాస్ తన మారుతి స్విఫ్ట్ కారులో (TS08 GQ 3699) ఆఫీస్ నుంచి బయలుదేరారు. రాజ్ భవన్ రోడ్డు సమీపానికి రాగానే అప్రమత్తమైన ఏసీబీ అధికారులు ఆయన కారును అడ్డుకుని ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
ఈ సోదాల్లో (ACB Raids) ఆయన కారులో ఎలాంటి పత్రాలు లేని రూ.2,40,000 నగదు బయటపడింది. ఆ డబ్బు గురించి అధికారులు నిలదీయగా.. జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్ ఎలాంటి సంతృప్తికరమైన సమాధానం చెప్పలేకపోయారు. దీంతో అక్రమంగా తరలిస్తున్న ఆ నగదును అధికారులు స్వాధీనం చేసుకుని పంచనామా నిర్వహించారు. ఈ అనధికారిక సొమ్ముపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. అలాగే ఈ భారీ మొత్తానికి సంబంధించి ఆదాయపు పన్ను (IT) శాఖ అధికారులకు కూడా ఏసీబీ సమాచారం అందించింది.
Also Read : దేశాన్ని కాపాడుకుందాం: రాహుల్ గాంధీ సంచలన పిలుపు
Follow Us On : WhatsApp

