ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో హైడ్రామా!

కలం, ఖమ్మం బ్యూరో: ఆసియా ఖండంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఖమ్మం వ్యవసాయ మార్కెట్ (Khammam Agricultural Market) యార్డ్‌లో ఒక విచిత్రమైన పరిపాలనాపరమైన గందరగోళం చోటుచేసుకుంది. సాధారణంగా ప్రభుత్వ శాఖల్లో బదిలీలు, నియామకాలు అనేవి నిరంతరం జరిగే ప్రక్రియలే అయినప్పటికీ, ఖమ్మం మార్కెట్ సెక్రటరీ బదిలీ వ్యవహారంలో చోటుచేసుకున్న తాజా మలుపులు ఇప్పుడు మార్కెట్ వర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర సంచలనంగా మారాయి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బదిలీ అయిన సెక్రటరీ స్థానంలో, బాధ్యతలు స్వీకరించడానికి జాయినింగ్ ఆర్డర్‌తో వచ్చిన కొత్త అధికారికి ఇక్కడ చుక్కెదురైనట్లు సమాచారం. ఆ కొత్త అధికారిని బాధ్యతలు స్వీకరించనీయకుండా వెనక్కి పంపిచడం మార్కెట్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. ఒక ప్రభుత్వ ఉత్తర్వును సైతం ధిక్కరించే స్థాయిలో ఇక్కడ చక్రం తిరుగుతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

​అయితే, ఈ వ్యవహారంలో అసలైన క్లైమాక్స్ ఏమిటంటే.. కొత్త అధికారి వెనుదిరిగిన కొద్దిసేపటికే, ప్రస్తుత సెక్రటరీ పదవీ కాలాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం నుంచి హుటాహుటిన ఉత్తర్వులు జారీ కావడం. ఇలా ఒకే అధికారికి వరుసగా ఐదోసారి పదవీ కాలాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం జీవో ఇవ్వడం మార్కెట్ (Khammam Agricultural Market) చరిత్రలోనే అరుదైన విషయంగా చెబుతున్నారు. కోట్లాది రూపాయల టర్నోవర్‌తో కూడిన ఈ ప్రతిష్టాత్మక మార్కెట్‌లో, నిబంధనలను పక్కనపెట్టి మరీ సదరు అధికారిపైనే ప్రభుత్వం ఎందుకు అంతటి ‘ప్రేమ’ కురిపిస్తోందనే ప్రశ్నలు ఇప్పుడు మార్కెట్ యార్డ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. వరుసగా ఐదుసార్లు పొడిగింపులు సాధించడం వెనుక అధికార పీఠంలో ఉన్న పెద్దల లేదా స్థానిక అగ్రనేతల బలమైన ఆశీస్సులు ఉన్నాయనేది బహిరంగ రహస్యమని మార్కెట్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

మిరప, పత్తి కొనుగోళ్లలో అగ్రగామిగా ఉండే ఈ మార్కెట్‌లో వ్యాపారులు, బ్రోకర్లు, అధికారుల మధ్య ఉన్న బలమైన నెట్‌వర్క్ దెబ్బతినకుండా ఉండేందుకే పాత వ్యూహకర్తనే సీట్లో కొనసాగించేలా ఒత్తిడి తెచ్చి ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు. సమర్థులైన అధికారులు ఎందరో ఉన్నప్పటికీ, ఒకే వ్యక్తికి ఇన్ని అవకాశాలు ఇవ్వడం వల్ల శాఖలోని ఇతర అధికారుల మనోధైర్యం దెబ్బతినే ప్రమాదం ఉందని, ఇది పరిపాలనా వ్యవస్థలో ఒక చెడు సంప్రదాయానికి దారితీస్తుందని పలువురు పెదవి విరుస్తున్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ రైతులు, వ్యాపారుల హక్కుల పరిరక్షణకు నిలయంగా ఉండాలి కానీ, ఇలాంటి బదిలీల ప్రహసనాలతో వివాదాలకు కేంద్ర బిందువు కాకూడదని మార్కెట్ శ్రేణులు కోరుకుంటున్నాయి.

Read Also: నాకున్న పెద్ద సమస్య అదే: సీఎం రేవంత్ రెడ్డి

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>