కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న ‘సర్’ (Telangana SIR) ప్రక్రియలో నేడు కీలక ఘట్టం మొదలుకానున్నది. నాలుగైదు నెలల పాటు రాష్ట్రమంతా డోర్ టు డోర్ వెరిఫికేషన్‌తో చేపట్టనున్న ఈ ప్రక్రియకు అనుసరించే ఫస్ట్ స్టెప్‌పై నేడు, రేపు కీలక నిర్ణయాలు జరగనున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 3.32 కోట్ల మంది ఓటర్ల వివరాలను సమగ్రంగా వెరిఫై చేసి తుది జాబితాను రూపొందించేందుకు అవసరమైన వేర్వేరు రకాల ఫామ్‌ల ముద్రణపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ఫోకస్ పెట్టింది. ఒక్కో ఓటరుకు రెండు చొప్పున ఫామ్‌లను అందజేయాల్సి ఉన్నందున మొత్తం ఆరున్నర కోట్లకు పైగా కాపీలను ముద్రించేందుకు టెండర్లను ఆహ్వానించింది. సమర్పించే గడువు ముగియడంతో టెక్నికల్ బిడ్డర్లతో సీఈఓ కార్యాలయం గురువారం సమావేశం నిర్వహించనున్నది. ఆ తర్వాతి రోజు ఫైనల్ టెండర్లను ఓపెన్ చేసి తక్కువ రేటు కోట్ చేసిన కంపెనీ అర్హతకు అనుగుణంగా నిర్ణయం తీసుకోనున్నది.
వేర్వేరు రకాల ఎన్యూమరేటర్ ఫామ్స్ :
రాష్ట్రంలోని ప్రతీ ఓటర్ వివరాలను బూత్ లెవల్ ఆఫీసర్లు ఇంటింటికీ వెళ్లి సేకరించనున్నారు. ఆ వివరాలను ఫిజికల్‌గా ఎన్యూమరేటర్ ఫామ్స్ లోని కాలమ్‌లలో భర్తీ చేయడంతో పాటు ఓటరు నుంచి సంతకం తీసుకోనున్నారు. మరో కాపీని బీఎల్ఓ సంతకం చేసి ఓటరుకు అందజేయనున్నారు. 2002లో చేపట్టి రూపొందించిన ఓటర్ల తుది జాబితాతో పాటు 2025లో ఎలక్షన్ కమిషన్ ఫైనల్ చేసిన జాబితాను ప్రామాణికంగా తీసుకుని అర్హులైన ఓటర్లను బీఎల్ఓలు ఇప్పుడు సర్ ప్రక్రియకు కీలకంగా తీసుకోనున్నారు. అప్పుడు ఉన్న ఓటర్లే ఇప్పుడూ కొనసాగినట్లయితే ఒక ఫామ్, అప్పుడు లేని ఓటర్లు ఇప్పుడు ఓటర్లుగా ఉంటే మరో రకమైన ఫామ్, అప్పుడూ ఓటర్లుగా ఉండి ఇప్పుడు లేనివారికి ఇంకో రకమైన ఫామ్, అప్పుడూ ఇప్పుడూ లేని ఓటర్లకు మరో ఫామ్.. ఇలా వేర్వేరు ఫామ్‌లు ఉంటాయని సీఈఓ కార్యాలయ వర్గాల సమాచారం. ఈ ఫామ్స్ అన్నీ తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఉంటాయి. ప్రత్యేక అవసరాలు ఏర్పడితే ఉర్దూలో కూడా ముద్రించాలని సీఈఓ ఆఫీస్ భావిస్తున్నది.
ఫీల్డ్ సర్వే చేసే బీఎల్ఓలకు కిట్స్ :
ఇంటింటికీ తిరిగి ఓటర్ల వివరాలను సేకరించే బీఎల్ఓలు, వారికి సహాయకులుగా ఉండే బీఎల్ఏలు, వీరిని పర్యవేక్షించే సూపర్‌వైజర్లకు ప్రత్యేకంగా కిట్లను అందించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రతీ పోలింగ్ సెంటర్‌కు ఒకరు చొప్పున బూత్ లెవల్ ఆఫీసర్లు మొత్తం 37 వేల మంది ఉన్నారు. వీరికి సహాయకంగా దాదాపు 20 వేల మంది బీఎల్ఏలు ఉన్నారు. వీరందరికీ సర్ (Telangana SIR) ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శకాలు, సూచనలు తెలియజేసే హ్యాండ్ బుక్స్, లీఫ్ లెట్స్, చెక్ లిస్ట్ సహా ఒక యూనిఫాం (టీ-షర్ట్), క్యాప్ (టోపీ), హ్యాండ్ బ్యాగ్.. ఇలాంటివి కూడా సీఈఓ కార్యాలయం అందజేయనున్నది. వీటిని ముద్రించడం, తయారుచేయడం కోసం విడిగా మరో టెండర్‌ను సీఈఓ ఆఫీస్ ఆహ్వానించింది. వాటికి సంబంధించి వచ్చిన కంపెనీలకు ఉండాల్సిన టెక్నికల్ అర్హతలను వివరించి అర్హులైనవాటిని షార్ట్ లిస్ట్ చేసే ప్రక్రియ గురువారం జరగనున్నది. శుక్రవారం ఫైనాన్షియల్ బిడ్ డాక్యుమెంట్లు ఓపెన్ చేసి తక్కువ ధర కోట్ చేసినవాటిని ఖరారు చేయనున్నది.
టెండర్లకు తొమ్మిది కంపెనీల ఆసక్తి :
ఎన్యూమరేటర్ ఫామ్స్ ముద్రణ కోసం ఐదు కంపెనీలు టెండర్ డాక్యుమెంట్లు సమర్పించగా బీఎల్ఓ కిట్ల ముద్రణ, తయారీ కోసం నాలుగు కంపెనీలు దాఖలు చేశాయి. వీటికి ఉన్న టెక్నికల్ అనుభవం, అర్హతలను గురువారం జరిగే బిడ్డర్ల (టెక్నికల్) సమావేశంలో సీఈఓ అధికారులు చర్చించి స్పష్టతకు రానున్నారు. ముద్రణకు సంబంధించి ఎంత కోట్ చేశారో ఫైనాన్షియల్ బిడ్ డాక్యుమెంట్లను శుక్రవారం ఓపెన్ చేసి తక్కువ ధర కోట్ చేసినవాటి అర్హతలను పరిశీలించి ఫైనల్ చేయనున్నారు. ఈ రెండు రోజుల్లోనే టెండర్ ప్రక్రియ ముగియనున్నది. సర్ ప్రక్రియకు కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి నోటిఫికేషన్ వచ్చేలోపే టెండర్ దక్కించుకున్న కంపెనీలు వీటిని సరఫరా చేసేందుకు వీలుగా పనులను మొదలుపెట్టనున్నాయి. ఏయే కంపెనీలకు టెండర్‌లు దక్కాయన్నది శుక్రవారం సాయంత్రానికి వెల్లడికానున్నది.
Read Also: సీఎం రేవంత్ పాలనపై హరీశ్ రావు షాకింగ్ కామెంట్స్
Follow Us On: X(Twitter)

