కలం, తెలంగాణ బ్యూరో : అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy), మంత్రులు మంగళవారం సమావేశమవుతున్నారు. సచివాలయంలో జరిగే ఈ సమావేశం (Collectors Conference) కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాలను విడిచి కలెక్టర్లు వస్తున్నందున అక్కడి అదనపు కలెక్టర్లకు తాత్కాలిక బాధ్యతల అప్పగింత పూర్తయింది. ఎజెండాలో పలు అంశాలను పెట్టుకున్నా అందులో ప్రధానంగా మూడింటిపైనే సీఎం ఫోకస్ పెట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జనగణన (Census), 99 రోజుల ప్రగతి ప్రణాళిక (99 Days Progress Plan), ధాన్య సేకరణ (Procurement)పై ప్రభుత్వం దిశానిర్దేశం చేయనున్నది. మరోవైపు ఈ సమావేశానికి సన్నాహకంగా సీనియర్ అధికారులతో చీఫ్ సెక్రటరీ సచివాలయంలో సోమవారం సమావేశమై కీలక అంశాలను వివరించారు. ఆయా అంశాలపై సమగ్రమైన సమాచారంతో రావాలని స్పష్టం చేశారు.
సీఎం చేతిలో ఐఏఎస్‌ల పర్‌ఫార్మన్స్ రిపోర్ట్ :
కలెక్టర్లతో గతేడాది ముఖ్యమంత్రి సమావేశమైన సందర్భంగా ప్రతీ ఐఏఎస్ ఆఫీసర్ నెల రోజుల ప్రగతి నివేదికను చీఫ్ సెక్రటరీకి సమర్పించాలని ఆదేశించారు. వాటిని క్రోడీకరించిన చీఫ్ సెక్రటరీ సమగ్రమైన నివేదికను ముఖ్యమంత్రికి సమర్పించారు. ఆయా అధికారుల పర్‌ఫార్మెన్స్ వివరాలన్నీ అందులో ఉండడంతో కలెక్టర్ల కాన్ఫరెన్సులో సీఎం ఏ విధమైన కామెంట్లు చేస్తారన్న ఉత్కంఠ నెలకొన్నది. అధికారులు సరిగ్గా పనిచేయడంలేదని మూడు రోజుల క్రితం అసంతృప్తిని వ్యక్తం చేయడంతో కొద్దిమందిపై ఆగ్రహం తప్పదనే ఆందోళన నెలకొన్నది. ప్రతీ మూడు నెలలకు ఒకసారి తానే స్వయంగా రివ్యూ చేస్తానని గతంలో సీఎం చెప్పినందున ఈ సమావేశంలో సీఎస్ నివేదికలోని అంశాలను ప్రస్తావించి సీరియస్ వార్నింగ్ ఇచ్చే అవకాశాలపైనా గుసగుసలు మొదలయ్యాయి.
మే నెలలో జరిగే జనగణనపై కీలక చర్చ :
కలెక్టర్లతో సచివాలయంలో మంగళవారం ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం వరకు జరిగే సమావేశంలో ఫస్ట్ సెషన్‌గా జనగణనపై ఉంటుందని సచివాలయ వర్గాలు ఎజెండాలోని అంశాన్ని గుర్తుచేశాయి. ఇప్పటికే చీఫ్ సెక్రటరీ వివిధ విభాగాల కార్యదర్శులతో రెండుసార్లు సమావేశం నిర్వహించి ప్రక్రియ ఎలా జరగనున్నదీ వివరించారు. అన్ని విభాగాల సమన్వయంతో ఎలాంటి లోపాలకు తావులేకుండా సక్సెస్ చేయాలని స్పష్టం చేశారు. ఆయా డిపార్టుమెంట్లు ఎంతమంది సిబ్బందిని సమకూరుస్తాయో కూడా వివరాలను రాబట్టారు. దీనికి అనుగుణంగా మే 11 నుంచి జూన్ 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు నెల రోజుల పాటు జరిగే ఇంటింటి సర్వే (House Listing) గురించి ఈ సమావేశంలో చర్చ జరగనున్నది. వివిధ విభాగాల ఉన్నతాధికారులు కూడా ఇందులో పాల్గొంటారు.
99 రోజుల ప్రగతి ప్రణాళికపై చర్చ :
రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు చేపట్టనున్న ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి టాప్ ప్రయారిటీ అని నొక్కిచెప్పనున్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం నేతృత్వంలోని క్యాబినెట్ సబ్ కమిటీ రివ్యూ చేసింది. దానికి ముందు ముఖ్యమంత్రి సైతం వివిధ విభాగాల సెక్రటరీలతో సమావేశమై ప్రభుత్వ ప్రాధాన్యతను వివరించారు. పట్టణాల్లో పరిశుభ్రత గురించి స్పష్టత ఇచ్చారు. పట్టణ ప్రాంతాలపై ఫోకస్ పెట్టి ప్రజలకు అందించాల్సిన సేవల గురించి క్లారిటీ ఇవ్వనున్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, వాటి ఫలాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేర్చడం, వారికి మెరుగైన సేవలను అందించడం, ఇందులో జిల్లా కలెక్టర్ల పాత్ర.. ఇలాంటి అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు అవుతున్నందున ప్రభుత్వ పాలసీ నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై సీఎం దృష్టి పెట్టారు.
ధాన్యం సేకరణపైనా ఫోకస్ :
మరికొన్ని రోజులు వరి కోతలు ప్రారంభమవుతున్నందున ధాన్య సేకరణకు అవసరమైన ఏర్పాట్లపై ఈ సమావేశం చర్చించనున్నది. వరి ధాన్యాన్ని రైతులు మార్కెట్ యార్డుకు తీసుకురావడం మొదలు కొనుగోలు ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వ యంత్రాంగం వారికి డబ్బులు చెల్లించడం వరకు స్పష్టమైన మార్గదర్శకాలపై సీఎం సహా మంత్రులు వివరించనున్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, రైతులకు ఎలాంటి ఇబ్బందులను కలిగించకుండా ప్రభుత్వ యంత్రాంగం అందించాల్సిన సహకారం గురించి చర్చ జరగనున్నది. ఇప్పటికే గోనె సంచలను సమకూర్చుకోవడంపై పౌర సరఫరాల శాఖ దృష్టి పెట్టింది. టెండర్లను ఆహ్వానించింది. కలెక్టర్ల ఆధ్వర్యంలో మరిన్ని అంశాలపై ముఖ్యమంత్రి చర్చించనున్నారు. ప్రజలకు సేవ చేసి జవాబుదారీగా వ్యవహరించాల్సిన అధికారుల నిర్లక్యంుఖపై ఈ సమావేశంలో (Collectors Conference) సీఎం కాస్త ఘాటుగానే మాట్లాడతారనే టాక్ మొదలైంది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐఏఎస్‌లపై కఠిన నిర్ణయాలు తీసుకుంటారనే గుబులు పట్టుకున్నది.
Read Also: డిజిటల్ హెల్త్ కార్డు.. ఫోటో, క్యూఆర్ కోడ్
Follow Us On: Youtube

