కలం, డెస్క్ : పుష్ప-2 ప్రీమియర్స్ సందర్భంగా సంధ్య థియేటర్ లో (Sandhya Theatre Case) జరిగిన తొక్కిసలాట దేశ వ్యాప్తంగా ఎంత సంచలనం రేపిందో మనం చూశాం. ఈ కేసులో తాజాగా కీలక మలుపు చోటు చేసుకుంది. పోలీసులు సమర్పించిన ఛార్జ్ షీట్ ను నాంపల్లి కోర్టు తిరస్కరించింది. ఛార్జ్ షీట్ లో టెక్నికల్ లోపాలున్నట్టు గుర్తించింది కోర్టు. ఛార్జ్ షీట్ కు హార్డ్ డిస్క్ లు, సీడీలు, పెన్ డ్రైవ్ లు జత చేయకపోవడంతో తిరస్కరించింది కోర్టు. కోర్టు ఛార్జ్ షీట్ ను తిరస్కరించడం ఇది రెండోసారి. అల్లు అర్జున్ సహా 23 మందిపై ఛార్జ్ షీట్ ను రెడీ చేశారు పోలీసులు.
2024 డిసెంబర్ 4న అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 ప్రీమియర్స్ సందర్భంగా తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో రేవతి అనే మహిళ చనిపోయింది. ఆమె కొడుకు శ్రీతేజ్ ఇప్పటికీ కోలుకోవట్లేదు. అచేతన స్థితిలోనే ట్రీట్ మెంట్ పొందుతున్నాడు. ఈ కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ అయి ఒక రోజు జైలుకు కూడా వెళ్లాడు. అప్పటి నుంచి ఈ కేసు గురించి ఏ చిన్న విషయం బయటకు వచ్చినా సోషల్ మీడియాలో సంచలనంగానే మారుతోంది.


