కలం, వెబ్ డెస్క్ : రంగారెడ్డి జిల్లా సంయుక్త సబ్ రిజిస్ట్రార్ (ఎస్ఆర్ఓ-1)గా పనిచేస్తూ ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న కందాడి మధుసూదన్ రెడ్డిపై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఆయన నివాసంతో పాటు బంధువులు, స్నేహితులు, అనుచరులకు సంబంధించిన ఏడు చోట్ల ఏకకాలంలో సోదాలు (ACB Raids) నిర్వహించారు.
ఈ తనిఖీల్లో అధికారులు భారీగా స్థిర, చరాస్తులను గుర్తించారు. దస్తావేజుల విలువ ప్రకారం వీటి మొత్తం విలువ సుమారు రూ. 7,83,35,302గా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈసీఐఎల్ పరిసరాల్లో 300 చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మించిన మూడంతస్తుల భవనం, ఇబ్రహీంపట్నంలో ఒక ఓపెన్ ప్లాట్, ఎకరం వాణిజ్య భూమిని గుర్తించారు. పరిగి మండలంలో 27 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు, స్విమ్మింగ్ పూల్ కలిగిన ఒక ఫామ్‌హౌస్‌ను అధికారులు గుర్తించారు. నివాసాల్లో నిర్వహించిన తనిఖీల్లో 1.2 కిలోల బంగారు ఆభరణాలు, రూ.9లక్షల నగదు లభించింది. మధుసూదన్ రెడ్డికి చెందిన మూడు ఖరీదైన కార్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఏఆర్కే స్పిరిట్స్ అనే మద్యం వ్యాపారంలో సుమారు రూ.80 లక్షల పెట్టుబడి పెట్టినట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా, తన భార్య, పిల్లల పేర్లతో రెండు షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి నిధుల మళ్లింపునకు పాల్పడినట్లు విచారణలో తేలింది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోందని, మరిన్ని ఆస్తులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ఏసీబీ వర్గాలు వెల్లడించాయి.


