epaper
Saturday, January 24, 2026
spot_img
epaper

కేటీఆర్ విచారణ… సజ్జనార్ కీలక ప్రకటన

కలం, వెబ్ డెస్క్ : ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిట్ విచారణకు హాజరయ్యారు. ఆయనను విచారించిన అనంతరం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ (VC Sajjanar) కీలక ప్రకటన విడుదల చేశారు. ఆయన జారీ చేసిన ప్రెస్ రిలీజ్ ప్రకారం.. “పంజాగుట్టా పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రైమ్ నెంబర్ 243/2024 కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ను విచారణకు పిలిచింది. జనవరి 23, 2026న ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాలని నోటీసు ఇచ్చారు.కేటీఆర్ నోటీసుకు స్పందించి, నిర్ణీత సమయానికి హాజరయ్యారు” అని తెలిపారు.

సిట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆయనను వివరంగా ప్రశ్నించారని లేఖలో సజ్జనార్ పేర్కొన్నారు. కేసుకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు, సాక్ష్యాలను పరిశీలించి, ఆయన నుంచి సమాచారం సేకరించారు. సాక్షులను సంప్రదించవద్దు, ప్రభావితం చేయవద్దు అని సూచించారు. అవసరమైతే మళ్లీ సమన్ చేస్తామని తెలిపారు. ఈ విచారణ పూర్తిగా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపైనే దృష్టి సారించింది. వేలాది పౌరుల ఫోన్లు అనధికారికంగా, చట్టవిరుద్ధంగా ట్యాప్ చేయబడ్డాయని, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, న్యాయవ్యవస్థకు చెందిన ప్రముఖులు సహా అన్ని వర్గాల వారు బాధితులయ్యారని ఆరోపణలు ఉన్నాయని సజ్జనార్ వెల్లడించారు.

ఇదిలా ఉండగా, కొందరు మీడియా సంస్థలు, వ్యక్తులు ఈ విచారణపై తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారని ప్రెస్ రిలీజ్‌లో సజ్జనార్ (Sajjanar) పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ భద్రతా కారణాలతో చేసినదని, ఎలాంటి చట్టవిరుద్ధత లేదని వదంతులు వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు. అయితే, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇలాంటి తప్పుడు కథనాలతో సంబంధం లేదని, చట్టబద్ధంగా, నిష్పక్షపాతంగా, వృత్తిపరంగా దర్యాప్తు కొనసాగుతోందని స్పష్టం చేశారు.

ప్రజలు అనధికారిక, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయవద్దని, ధృవీకరించని వార్తలను విస్మరించాలని, అధికారిక మార్గాల ద్వారా మాత్రమే వాస్తవాలపై ఆధారపడాలని కోరారు. ఈ కేసు తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠను రేపుతోంది. మాజీ మంత్రి కేటీఆర్ విచారణకు హాజరవడం, సిట్ దర్యాప్తు తీవ్రత ఇటీవలి రాజకీయ మార్పులకు అద్దం పడుతున్నాయి. ముందు ముందు మరిన్ని వివరాలు బయటపడే అవకాశం ఉంది. అయితే అధికారిక సమాచారంపైనే ఆధారపడాలని పోలీసులు సూచిస్తున్నారు.

Read Also: వ్యవసాయం ఒక విజ్ఞానం : తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>