కలం, నల్లగొండ బ్యూరో: నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు (Chervugattu Jatara) శ్రీపార్వతీ జడల రామలింగేశ్వర స్వామి జాతర శుక్రవారం నుంచి ప్రారంభమైంది. ఈ జాతర వారంపాటు అంగరంగ వైభవంగా జరగనుంది. అందుకు సంబంధించి అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 30 వరకు జరిగే ఈ ఉత్సవాల్లో లక్షలాది మంది భక్తులు యావత్ తెలంగాణతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి భారీగా తరలివస్తారు. శుక్రవారం నల్లగొండ పట్టణంలోని రామాలయం నుంచి నగరోత్సవం ప్రారంభమవుతుంది. దీంతో ఇప్పటికే చెర్వుగట్టు(Chervugattu Jatara)లో జాతర సందడి నెలకొంది. దుకాణాల ఏర్పాటుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. స్వాగతతోరణాలు, విద్యుత్ దీపాలంకరణ కంప్లీట్ అయ్యింది. ఇదిలావుంటే.. శుక్రవారం నల్లగొండ పట్టణంలో నగరోత్సవం, 25న గణపతిపూజ, అఖండస్థాపన, 26న తెల్లవారుజామున పార్వతీజడల రామలింగేశ్వరస్వామి కల్యాణం, 28 తెల్లవారుజామున అగ్నిగుండాలు, 29న తెల్లవారుజామున దోపోత్సవం, అశ్వవాహన సేవ, 29న ఉదయం మహాపూర్ణాహుతి, సాయంత్రం పుష్పోత్సవం, ఏకాంత సేవలు, 30న సాయంత్రం చెర్వుగట్టు, ఎల్లారెడ్డిగూడెం పురవీధుల్లో గజవాహన సేవతో గ్రామోత్సవం నిర్వహిస్తారు. దీంతో చెర్వుగట్టు జాతర ఉత్సవాలు ముగియనున్నాయి.
ట్రస్ట్ బోర్డుకు నోటిఫికేషన్..
చెర్వుగట్టు ఆలయ ట్రస్ట్‌బోర్డును ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం మరోసారి నోటిఫికేషన్ విడుదల చేసింది. 20 రోజుల్లోపు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ట్రస్టు బోర్డు సభ్యుడిగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అయితే ఇటీవల చెర్వుగట్టు జాతర నేపథ్యంలో తగినంత సమయం లేకపోవడంతో ఉత్సవ కమిటీని అనధికారికంగా ప్రకటించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఒకట్రెండు రోజుల్లో రానున్నాయి. ఈ క్రమంలోనే ట్రస్టు బోర్డుకు సంబంధించి నోటిఫికేషన్ రావడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం అనధికారికంగా ప్రకటించిన ఉత్సవ కమిటీనే భవిష్యత్తులో ట్రస్టు బోర్డుగా ఏర్పాటు చేస్తారనే ప్రచారం లేకపోలేదు.


