కలం, వెబ్ డెస్క్ : మున్నేరు–పాలేరు లింక్ కెనాల్ తో ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల నీటి కష్టాలు తీరుతాయన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy). ఈ ప్రాజెక్ట్ ద్వారా వరద ప్రమాదాలు కూడా తగ్గుతాయని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం రూ.162.57 కోట్లు కేటాయించిందని మంత్రి చెప్పుకొచ్చారు. ఈ ప్రాజెక్టు కంప్లీట్ అయితే ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో 1.38 లక్షల ఎకరాలకు సాగునీటిని స్థిరీకరించవచ్చని స్పష్టం చేశారు. ఈ మున్నేరు–పాలేరు లింక్ కాలువ 9.6 కి.మీ పొడవుతో సెకనుకు 4,500 క్యూసెక్కుల నీటి ప్రవాహాన్ని తట్టుకునేల డిజైన్ చేసినట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) తెలిపారు.
‘ఈ కాలువ తో మున్నేరు నది నుంచి ప్రతి ఏడాది వచ్చే వరద నీటిని సద్వినియోగం చేసుకోవచ్చు. మొత్తం 50టీఎంసీల నీటిని ఒడిసిపట్టుకోవచ్చు. మున్నేరు నది వల్ల ఖమ్మం జిల్లాకు వరద ముప్పును కూడా ఈ లింక్ కాలువ తగ్గిస్తుంది. మున్నేరు–పాలేరు లింక్ ప్రాజెక్ట్ వల్ల శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ స్టేజ్–2ను మరింత బలోపేతం చేయవచ్చు‘ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. సూర్యాపేట జిల్లాలోని మోతే ఎత్తిపోతల పథకం కింద ఉన్న 46712 ఎకరాలకు నిరంతరం ఈ లిక్ కెనాల్ ద్వారా నీటిని అందించవచ్చని చెప్పుకొచ్చారు మంత్రి ఉత్తమ్.
ఈ ప్రాజెక్ట్ తక్కువ ఖర్చుతో అనేక రకాల ప్రయోజనాలను అందిస్తోందని చెప్పారు. శ్రీరామదాసు పథకం ద్వారా 70వేల ఎకరాల ఆయకట్టుకు కూడా నీటి లభ్యత ఈ లింక్ కెనాల్ వల్ల పెరుగుతుందన్నారు. కేవలం సాగునీటికే కాకుండా సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లోని ప్రజల తాగునీటి అవసరాలను కూడా తీర్చేందుకు ప్లాన్ చేస్తున్నామని మంత్రి వివరించారు. తాగునీటి కోసం 4.70 టీఎంసీల నీటిని కేటాయిస్తున్నామన్నారు. సీతారామ ప్రాజెక్ట్ కోసం చెల్లిస్తున్న విద్యుత్ ఛార్జీలు ప్రభుత్వానికి తప్పుతాయన్నారు. అలాగే మిగులు జలాలతో పాలేరు రిజర్వాయర్ దిగువన ఉన్న హైడల్ ప్లాంట్ లో 2 మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేసుకోవచ్చని మంత్రి వివరించారు.


