కలం, నల్లగొండ బ్యూరో: సంక్రాంతి (Sankranti) పర్వదినం నేపథ్యంలో ఫేక్ వీఐపీలు (Fake VIPs) పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చారు. ఫలానా ఎమ్మెల్యే బామ్మర్దిని.. ఫలానా మంత్రి కొడుకు.. అల్లుడినంటూ వందలాదిమంది ఫేక్ వీఐపీలు టోల్ గేట్లను (Toll Gates) దాటి వెళుతుండటం గమనార్హం. సంక్రాంతి పండుగకు మూడు రోజుల ముందు నుంచి ఈ ఫేక్ వీఐపీల తాకిడి టోల్ ప్లాజాలకు పెరిగిపోయింది. తిరిగి ఏపీ నుంచి హైదరాబాద్ బాట పట్టే వాహనాల్లోనూ ఫేక్ వీఐపీల తాకిడి టోల్ ప్లాజా సిబ్బందితో పాటు మిగిలిన వాహనదారులను ఇబ్బంది పెడుతోంది. వీటికి తోడు టోల్ ఫ్లాజాల వద్ద అత్యవరస సైరన్స్(పోలీస్, అంబులెన్స్) దుర్వినియోగం అవుతుండటం ఇతర ప్రయాణికులకు చికాకు తెప్పిస్తుంది.
అసలే ట్రాఫిక్ రద్దీ నేపథ్యంలో గంటల తరబడి టోల్ ప్లాజాల వద్ద వాహనాల్లో నిరీక్షించాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలోనే అత్యవసర సైరన్లను మోగిస్తూ మరింతగా ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తుంది. అయితే విచ్చలవిడిగా సైరన్స్ వాడుతున్న వారిలో పోకిరీలే అధికంగా ఉండటం చర్చనీయాంశంగా మారుతుంది.
టోల్ ఫీజు ఎగ్గొట్టేందుకు..
ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై పంతంగి (Panthangi), కొర్లపహాడ్ (Korlapahad), హైదరాబాద్- వరంగల్ రహదారిపై ఉన్న బీబీనగర్ టోల్ ప్లాజాల (Toll Gates) వద్ద ఫేక్ వీఐపీల తాకిడి విపరీతంగా తెరపైకి వచ్చింది. ఈ ఫేక్ వీఐపీలు టోల్ రుసుము తప్పించుకునేందుకు సైరన్ తో హంగామా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు, మంత్రుల పేరు చెబుతూ వీఐపీల్లా బిల్డప్ ఇస్తూ టోల్ ప్లాజా నిర్వాహకులకు టోకరా పెడుతున్నారు. సైరన్ చప్పుడుతో సైడ్ ఇచ్చేలా మిగతా వాహనదారులను పోకిరీలు హడలెత్తిస్తున్నారు. సంక్రాంతి పండుగకు ముందు మూడు రోజులు, తిరుగు ప్రయాణంలో మరో మూడు రోజుల పాటు సైరన్లతో పంతంగి, కొర్లపహాడ్ టోల్ గేట్లను దాటుకుంటూ వందలాది వాహనాలు వెళ్లాయి.
అయితే ఇందులో ప్రధానంగా ట్రాఫిక్ క్లియరెన్స్ కంటే టోల్ ఫీజు ఎగ్గొట్టేందుకేనని అధికారుల ప్రాథమిక అంచనా. ఇదిలా ఉంటే.. టోల్ బూతుల వద్ద ఫీజు మినహాయింపు కోసం ఒక్కో వెహికల్ కు ఐదు నిమిషాలకు పైగా సమయం పడుతుంది. దీంతో మరింతగా వాహనాల ట్రాఫిక్ జామ్ పెరిగిపోతుంది. పోకిరీల సైరన్స్ నియంత్రించడం పోలీసులకు సవాల్‌గా మారుతోంది.
Read Also: చరిత్రకెక్కనున్న కాంగ్రెస్ సర్కార్..!
Follow Us On: Sharechat


