కలం, వరంగల్ బ్యూరో : జనవరి 18, 2026 తెలంగాణ రాష్ట్ర పాలన చరిత్రలో ఓ కొత్త అధ్యాయానికి నాంది పలుకబోతోంది. ఇప్పటి వరకు సచివాలయ గదులకే పరిమితమైన తెలంగాణ కేబినెట్ (Telangana Cabinet) సమావేశం తొలిసారి ప్రజల మధ్యకు.. అది కూడా అటవీ ప్రాంతమైన మేడారంలో (Medaram) జరుగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) నేతృత్వంలోని మంత్రివర్గం 18న మేడారంలో సమావేశం కావాలని నిర్ణయించింది. దీంతో పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న ఆలోచనకు కాంగ్రెస్ ప్రభుత్వం పురుడు పోసినట్లు అయిందన్న చర్చ జరుగుతోంది. ఆదివాసీల ఆరాధ్య దేవతలైన సమ్మక్క–సారలమ్మ జాతర నేపథ్యంతో ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా, సామాజికంగా విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది.
హైదరాబాద్ వెలుపల తొలి కేబినెట్ భేటీ
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ నగరం వెలుపల మంత్రివర్గ సమావేశం జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం. అంతేకాదు అటవీ ప్రాంతంలో కేబినెట్ భేటీ నిర్వహించడం కూడా ఒక అరుదైన పరిణామంగా చెప్పుకోవచ్చు. మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందింది. కోట్లాది మంది భక్తులు హాజరయ్యే ఈ జాతర తెలంగాణ గిరిజన సంస్కృతికి ప్రతీక. అలాంటి పవిత్ర ప్రదేశంలో కేబినెట్ సమావేశం నిర్వహించాలన్న ఆలోచన ద్వారా గిరిజనులకు తమ ప్రభుత్వం ఎంత ప్రాధాన్యం ఇస్తుందో చాటిచెప్పాలన్నది కాంగ్రెస్ ప్రభుత్వ వ్యూహంగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇది కేవలం పరిపాలనా నిర్ణయం మాత్రమే కాకుండా, గిరిజన వర్గాలకు ఒక స్పష్టమైన రాజకీయ సందేశంగా కూడా భావిస్తున్నారు.
అభివృద్ధి నిర్ణయాలు రాజధానికే పరిమితం కాకుండా, అటవీ ప్రాంతాల వరకూ చేరాలన్న సంకల్పాన్ని ఈ సమావేశం ప్రతిబింబిస్తోందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంత్రి సీతక్క (Minister Seethakka) పర్యవేక్షణ లో మేడారంలోని హరిత హోటల్ (Haritha Hotel) ప్రాంగణంలో కేబినెట్ సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు. 1500 పోలీస్ బలగాలతో బందోబస్త్ చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి 18వ తేదీ ఉదయం ఖమ్మం నగరంలో మున్సిపల్ ఎన్నికల ప్రచార సభ అనంతరం, మధ్యాహ్నం మేడారం చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు కేబినెట్ సమావేశంలో (Telangana Cabinet) పాల్గొంటారు. రాత్రి మేడారంలోనే సీఎం రేవంత్ రెడ్డి బస చేస్తారు.
గతంలో అనేక మంది సీఎంలు, గవర్నర్లు, కేంద్ర మంత్రులు మేడారంలో పర్యటించినప్పటికీ బస చేసిన వారు ఒక్కరు కూడా లేరు. రేవంత్ రెడ్డి మేడారంలో బసచేసిన తొలి సీఎంగా చరిత్రలో నిలిచిపోతారు. 19వ తేదీ ఉదయం సమ్మక్క-సారలమ్మ నూతన ప్రాంగణాలను ప్రారంభించనున్న సీఎం అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతారు.
Read Also: సికింద్రాబాద్‌లో బీఆర్ఎస్ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
Follow Us On: Sharechat


