నల్లగొండలో ఘనంగా ఐలూ 12వ మహాసభలు

కలం, నల్లగొండ : న్యాయవాద వృత్తిలో రాణించాలంటే పుస్తక పరిజ్ఞానంతో పాటు కోర్టు విధానాలు, న్యాయపరమైన ఆచరణాత్మక అంశాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వసంత్ పాటిల్ సూచించారు. జూనియర్ సివిల్ జడ్జి పరీక్షలకు సిద్ధమయ్యే పేద, గ్రామీణ విద్యార్థులకు ఐలూ (AILU) అందిస్తున్న శిక్షణ, నిర్వహిస్తున్న నమూనా పరీక్షలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని అభినందించారు.

ఐలూ నల్లగొండ (Nalgonda) జిల్లా 12వ మహాసభలు శనివారం మదన్‌మోహన్ నగర్‌లోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో ప్రకాశ్‌రావు ప్రాంగణంలో ప్రీ బ్రహ్మచారి, యాదగిరి, ఇబ్రహీం అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి వసంత్ పాటిల్ మాట్లాడుతూ.. తాను మారుమూల గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి ఈ స్థాయికి చేరుకున్నానని, తన ప్రయాణంలో క్రమశిక్షణ, నిరంతర అధ్యయనం కీలక పాత్ర పోషించాయని తెలిపారు. ఇంగ్లీష్‌పై పట్టు సాధించేందుకు ప్రతిరోజూ కొత్త పదాలు నేర్చుకోవడం, వాక్యాలు రాయడం ఉపయోగపడుతుందని సూచించారు. ఆర్థిక, సామాజిక నేపథ్యాన్ని చూసి ఆత్మన్యూనతకు గురికావద్దని, శ్రమకు ప్రత్యామ్నాయం లేదని స్పష్టం చేశారు.

యువతలో పెరుగుతున్న సెల్‌ఫోన్ వ్యసనం, అశ్లీల కంటెంట్, మాదకద్రవ్యాల వినియోగంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు మద్యం, గంజాయికి దూరంగా ఉండాలని, మంచి స్నేహితులను ఎంచుకోవాలని సూచించారు. జూనియర్ అడిషనల్ సివిల్ జడ్జి కే. షరాన్ తేజ మాట్లాడుతూ.. ఐలూ నిర్వహించే నమూనా పరీక్షలను సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు. తాను ఐలూ నిర్వహించిన పరీక్షలో 83 మార్కులు సాధించానని, ఆ అనుభవం ప్రధాన పరీక్షల్లో ఉపయోగపడిందని తెలిపారు.

న్యాయ కళాశాలలో మొదటి సంవత్సరం నుంచే కోర్టులకు వెళ్లి విచారణలను పరిశీలించాలని, సీనియర్ల వద్ద ఇంటర్న్‌షిప్ చేస్తూ అనుభవానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. యువ న్యాయవాదులకు సీనియర్ల మార్గదర్శకత్వం ఎంతో కీలకమన్నారు. ఈ కార్యక్రమంలో ఐలూ జాతీయ కమిటీ సభ్యులు వై. శ్రీనివాసరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు మామిడి వెంకట్‌రెడ్డి, జిల్లా నాయకులు మీసాల వెంకటేశ్వర్లు, కొండ యాదగిరి, బ్రహ్మచారి, ఇబ్రహీం, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>