కలం, అచ్చంపేట: నల్లమల్లలోని అత్యంత వెనుకబడిన ప్రాంతమైన పదర, అమ్రాబాద్ మండలాలకు సాగునీరు అందించే విషయంలో అచ్చంపేట (Achampet) నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సీఎం సభలో నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి మౌనమేలా..? అని సాగునీటి సాధన కమిటీ శనివారం మీడియా వేదికగా ప్రశ్నించింది. ఈ సందర్భంగా సాగునీటి సాధన కమిటీ కన్వీనర్ కలుముల నాసరయ్య మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదాలతోనే తెలంగాణ ఉద్యమం ఆరంభమైందని గుర్తు చేశారు.
కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్దకాలం దాటిన అప్పర్ ప్లాటూకు నీటి చుక్క రాలేదని విమర్శించారు. గత ఐదారు దశాబ్దాలుగా ఆంధ్ర పాలకుల వల్ల, గడిచిన దశాబ్ద కాలంగా ఉత్తర తెలంగాణ పాలకుల వల్ల అచ్చంపేట సాగునీటి విషయంలో వివక్షకు గురవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అచ్చంపేట నియోజకవర్గం బిడ్డ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు సాగునీరు రాకపోతే ఇక భవిష్యత్తులో ఎప్పుడు రాదని జోస్యం చెప్పారు.
తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దులను కలుపుతూ బ్రిడ్జి ఏర్పాటుతోపాటు ఎగువ పీఠభూమి (అప్పర్ ప్లాటూ) ప్రాంతానికి సాగునీరు అందించే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనలు చేస్తారని నల్లమల ప్రజలు కోటి ఆశలతో ఎదురు చూశారన్నారు. నల్లమల ప్రజలకు ఉద్యమాలు కొత్తేమి కాదని, పాలకులు పట్టించుకోకపోతే సాగునీటి కోసం తెలంగాణ ఉద్యమ తరహలో మరో ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో అప్పర్ ప్లాటూ సాగునీటి సాధన సమితి సీనియర్ జర్నలిస్ట్ ఆదాఅంజయ్య, రిటైర్డ్ టీచర్ విజయమోహన్, రాజారాం, వెంకటేష్, రామకోటి, ఎం.డి రబ్బాని, ఎం. ఆంజనేయులు, యాదయ్య, ఓంకార్ సామ నిరంజన్, అంజనేయులు, రంగయ్య, సుధాకర్, వెంకట్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.

