కలం, జనగామ: భక్తజన సందోహం.. వేదమంత్రాల మంగళధ్వనులు.. మంగళవాయిద్యాల నడుమ లింగాలఘణపురం మండలం జీడికల్ ఆలయంలో (Jeedikal Temple) శ్రీ వీరాచల రామచంద్రస్వామి వారి కల్యాణ మహోత్సవం శనివారం వైభవంగా జరిగింది. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన స్వామివారి కల్యాణాన్ని తిలకించేందుకు వేలాదిగా భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది.
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరై స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వరుసగా మూడోసారి స్వామివారి కల్యాణానికి పట్టువస్త్రాలు సమర్పించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. జీడికల్ క్షేత్ర అభివృద్ధికి గత మూడేళ్లలో రూ.3 కోట్లు కేటాయించామని, జనగామ నుంచి జీడికల్ వరకు రూ.8.30 కోట్లతో రహదారి నిర్మాణ పనులు చేపట్టామని తెలిపారు.
భక్తులకు మరిన్ని మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తానని, ఆలయ (Jeedikal Temple) అభివృద్ధిలో దాతలు కూడా భాగస్వాములు కావాలని కడియం కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గుర్రం బాలరాజు గౌడ్, సర్పంచ్ మమత సంపత్, ఆర్డీవో గోపీరామ్, డీసీపీ రాజమహేంద్ర నాయక్, అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

