కలం, నిర్మల్: సెలవు దినాల్లో నిబంధనలకు విరుద్ధంగా తరగతులు, పరీక్షలు నిర్వహిస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలపై విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. నిర్మల్(Nirmal) జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో శనివారం సమావేశం నిర్వహించారు. పట్టణంలోని శ్రీచైతన్య పాఠశాల యాజమాన్యం సెలవు రోజుల్లోనూ తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులపై చదువుల ఒత్తిడి పెంచుతోందని ఆరోపించారు. ఆదివారం నిర్వహించనున్న ఒలింపియాడ్ పరీక్షను తక్షణమే నిలిపివేయాలని కోరారు.
విద్యార్థుల శారీరక, మానసిక వికాసంతో పాటు కుటుంబ సభ్యులతో గడిపేందుకు వీలుగా ప్రభుత్వం ఆదివారాలు, ప్రతి నెల రెండో శనివారం, ఇతర పండుగ సెలవులను ప్రకటిస్తోందని గుర్తు చేశారు. నిరంతర చదువులు, పరీక్షల ఒత్తిడితో సతమతమవుతున్న చిన్నారులకు విశ్రాంతి ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోకుండా సెలవు దినాల్లోనూ తరగతులు, పరీక్షలు నిర్వహిస్తున్న సంబంధిత పాఠశాల యాజమాన్యంపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దిగంబర్, ఏఐపీఎస్‌యూ జిల్లా కార్యదర్శి పరమేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి కైలాస్ తదితరులు పాల్గొన్నారు

