కలం, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న డీ లిమిటేషన్ బిల్లును ఒప్పుకోబోమని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) ప్రకటించారు. ఇండియా కూటమి నేతలు ఏకపక్షంగా ఈ బిల్లును తిరస్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఢిల్లీలో కూటమి నేతల సమావేశం అనంతరం ఖర్గే మీడియాతో మాట్లాడారు. “ప్రజాస్వామ్యానికి ముప్పు కలిగించేందుకే మోదీ ప్రభుత్వం డీ లిమిటేషన్ బిల్లు తెస్తోంది. అధికారాన్ని శాశ్వతం చేసుకోవడమే వారి అసలైన లక్ష్యం. ఒకప్పుడు 400 సీట్లు టార్గెట్ అన్నవారు, ఇప్పుడు 800 సీట్లు గెలుచుకుంటాం అంటారు. ఈ బిల్లు అమల్లోకి వస్తే ఎస్సీ, ఎస్టీ వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది” అన్నారు.
ఎస్సీ, ఎస్టీల సీట్లు తగ్గించేందుకే..
మీడియాతో ఖర్గే మాట్లాడుతూ.. “రాష్ట్రాల వారీగా ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా ప్రాతినిధ్యం దక్కాల్సిన సీట్లు ఎన్ని రిజర్వ్ చేస్తారో బిల్లులో స్పష్టంగా పొందుపరచలేదు. ఒకవైపు 2026లో చేపట్టాల్సిన జనాభా గణనపై బీజేపీ సైలెంట్‌గా ఉంది. ఒకవేళ జనగణన ముందే చేసి ఉంటే.. ఎస్సీ, ఎస్టీలకు సీట్లు జనాభా దామాషా ప్రకారం సహజంగానే పెరిగి ఉండేవి. ఈ రకంగా చూసినప్పుడు ఎస్సీల సీట్లు కూడా పెరుగుతాయి. ఇలా కాకుండా, ఉద్దేశపూర్వకంగా ఎస్సీ, ఎస్టీల వాటాను పార్లమెంటులో తగ్గించి, తక్షణ రాజకీయ ప్రయోజనాల కోసమే ఇలా చేస్తున్నారని స్పష్టమవుతోంది” అని విమర్శించారు.

