కలం, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయిగురి జిల్లా తెలిపారాలో ఉన్న బిస్లెరి ప్లాంట్‌లో తయారైన ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ (Bisleri Water) బ్యాచ్ పిబి201 విక్రయాలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ (FSSAI) నిషేధం విధించింది. ఆగస్టు 12, 2026న జారీ చేసిన ఆదేశాల మేరకు సంస్థ ఇప్పటికే ఆ బ్యాచ్‌ను మార్కెట్ నుంచి వెనక్కి తీసుకుంది.
రెగ్యులేటరీ పరీక్షల్లో సదరు బ్యాచ్ నమూనాల్లో కోలిఫామ్ బ్యాక్టీరియా ఉన్నట్లు ప్రాథమిక, రెఫరల్ ల్యాబొరేటరీలు గుర్తించాయి. అయితే, బిస్లెరి సంస్థ అదే బ్యాచ్‌కు చెందిన నమూనాలను ఎఫ్ఎస్ఎస్ఏఐ గుర్తింపు పొందిన రెండు స్వతంత్ర ల్యాబొరేటరీల్లో పరీక్షించగా, అవి అన్ని ఆహార భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లు ఫలితాలు వచ్చాయని వెల్లడించింది.
ఈ రెండు పరీక్షల ఫలితాల్లో వ్యత్యాసం ఉన్న నేపథ్యంలో నమూనాల సేకరణ, పరీక్షా విధానాలు, ల్యాబొరేటరీ నివేదికలపై సమగ్ర సమీక్ష చేపట్టాలని బిస్లెరి ఎఫ్ఎస్ఎస్ఏఐని కోరింది. వాస్తవాలను నిర్ధారించేందుకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని తెలిపింది.
తాగునీటి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, తమ పది దశల తయారీ ప్రక్రియలో 90కి పైగా నాణ్యతా పరీక్షలు నిర్వహిస్తున్నామని సంస్థ పేర్కొంది. 50 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన బిస్లెరి ఇంటర్నేషనల్‌కు భారత్, యూఏఈలో 143 ప్లాంట్లు, 6,000కు పైగా డిస్ట్రిబ్యూటర్లు, 7,500 పంపిణీ వాహనాలు ఉన్నాయని వెల్లడించింది.

