సైలెంట్ మోడ్‌లోకి కోమటిరెడ్డి.. తెరవెనుక ఏం జరిగింది?

కలం, నల్లగొండ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో కొంతకాలంగా వేడి రాజేస్తున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Raj Gopal Reddy).. ఒక్కసారిగా మౌనం పాటించడం రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. రాష్ట్ర కాంగ్రెస్ కొత్త ఇన్‌చార్జ్ బీఎం సందీప్ రంగంలోకి దిగి రాజగోపాల్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించిన తర్వాత ఆయన సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోవడంతో క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారా? లేదంటే భవిష్యత్తులో ఏదైనా పదవి ఇస్తామని హామీ ఇచ్చారా? అనే చర్చ నడుస్తున్నది. ఈ మౌనం శాశ్వతమా? లేక వ్యూహాత్మకమా? అనే ప్రశ్న తలెత్తుతున్నది.

చర్యలు తప్పవని హెచ్చరిక

కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా బీఎం సందీప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పార్టీలో క్రమశిక్షణపై ప్రత్యేక దృష్టిసారించారు. ఈ క్రమంలోనే రాజగోపాల్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఏవైనా సమస్యలు, అసంతృప్తి ఉంటే నేరుగా తనకు లేదా పార్టీ హైకమాండ్ చెప్పుకోవాలి గానీ బహిరంగంగా మీడియా ముందుకు వెళ్లి పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీయవద్దని సందీప్ హెచ్చరించినట్టు సమాచారం.

గతంలో పార్టీని వీడి బీజేపీలో చేరడం, మునుగోడు ఉప ఎన్నికలో పరాజయం, తిరిగి కాంగ్రెస్‌లోకి రావడం వంటి పరిణామాలను గుర్తు చేస్తూ.. ‘పార్టీ మీకు ఏం అన్యాయం చేసింది? మీరు పార్టీకి ఎంతమేర ఉపయోగపడ్డారు?” అనే కోణంలో నిలదీసినట్లు తెలిసింది. పార్టీ గీత దాటితే ఎంతటి వారైనా చర్యలు తప్పవన్న సంకేతాలను ఇస్తూనే భవిష్యత్తులో మంచి బాధ్యతలు దక్కుతాయనే భరోసా కూడా ఇచ్చినట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

నిధులు, పదవులపై ఆవేదన

ఇన్‌చార్జ్ జోక్యంతో రాజగోపాల్ రెడ్డి కాస్త సంయమనం పాటిస్తున్నట్లు కనిపిస్తున్నప్పటికీ, అసంతృప్తి పూర్తిగా చల్లారలేదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గానికి నిధుల విడుదలలో జాప్యం, అధికారుల తీరు, పార్టీ కోసం కష్టపడిన వారిని కాదని ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆవేదనను సందీప్ ముందు రాజగోపాల్ రెడ్డి బలంగా వినిపించినట్లు తెలుస్తున్నది. తన వ్యాఖ్యలతో పార్టీకి నష్టం కలగలేదని, క్షేత్రస్థాయి వాస్తవాలనే ప్రస్తావించానని తెలిపినట్టు సమాచారం. మరోవైపు మంత్రి పదవిపై పెట్టుకున్న ఆశలు నెరవేరకపోవడమే రాజగోపాల్ రెడ్డి అసంతృప్తికి కారణమని పార్టీ వర్గాలు అంటున్నాయి.

అందుకే వెనక్కి తగ్గారా?

రాజగోపాల్ రెడ్డి ఒక్కసారిగా సైలెంట్ మోడ్‌లోకి వెళ్లడం వెనుక ప్రస్తుత రాజకీయ పరిస్థితులు కూడా కీలక పాత్ర పోషించాయని పరిశీలకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకా రెండేళ్లకు పైగా పదవీకాలం ఉండడంతో.. ఈ సమయంలో తిరుగుబాటు చేస్తే రాజకీయంగా తనకే నష్టం తప్ప లాభం ఉండదని రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నట్టు తెలిసింది. దీనికి తోడు ప్రస్తుతం ఇతర రాజకీయ పార్టీల్లోనూ ఆయనకు సులభంగా అనుకూల అవకాశాలు కనిపించడం లేదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. డీసీసీ, పీసీసీ స్థాయిలో వచ్చిన ఫిర్యాదులు హైకమాండ్ దృష్టికి వెళ్లడం, పార్టీ లైన్ దాటితే క్రమశిక్షణ చర్యలు తప్పవన్న హెచ్చరికలు కూడా ఆయనను వెనక్కి తగ్గేలా చేసి ఉండవచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి.

హామీలు నెరవేరేనా?

స్టేట్ ఇన్‌చార్జ్ బీఎం సందీప్ రంగంలోకి దిగడంతో రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్‌కు బ్రేక్ పడినట్టు కనిపిస్తున్నా.. భవిష్యత్తులో ఏం జరుగుతుందన్న ఉత్కంఠ నెలకొన్నది. హైకమాండ్ ఇచ్చిన హామీలు నిజంగానే నెరవేరుతాయా? లేక నిధులు, పదవుల లెక్కల్లో తేడా వస్తే మళ్లీ పాత కథే పునరావృతమవుతుందా? అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. నిధుల కేటాయింపు, పార్టీ పదవుల పంపకంలో ఆశించిన స్థాయిలో కదలిక కనిపించకపోతే రాజగోపాల్ రెడ్డి తనదైన శైలిలో మరోసారి గళం విప్పే అవకాశాలను కొట్టిపారేయలేమని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతానికి మౌనం పాటిస్తున్నా.. ఈ అసమ్మతి ఎప్పుడు, ఏ రూపంలో మళ్లీ బయటకు వస్తుందోనన్న ఆందోళన పార్టీలో నెలకొన్నది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>