జూరాలలో 2 టీఎంసీలే.. ఇక సాగు నీళ్లు బంద్!

కలం, జోగులాంబ గద్వాల: జూరాల ప్రాజెక్టు (Jurala Project)లో నీటి నిల్వ బాగా తగ్గిపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 9.65 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 5.92 టీఎంసీలు ఉన్నాయి. ఇందులో డెడ్‌స్టోరేజీ, ఆవిరి నష్టాలు పోను.. 2.22 టీఎంసీలు మాత్రమే వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. దీంతో నీటిని పొదుపుగా వాడాలని ప్రాజెక్టు నుంచి సాగు నీటి విడుదలను పూర్తిగా నిలిపివేశారు. ప్రాజెక్టులో ప్రస్తుతమున్న నీళ్లను మిషన్‌ భగీరథ కింద తాగునీటి అవసరాలకే అందించాలని నిర్ణయించారు.

కర్ణాటక ఆదుకుంటేనే..

గతేడాది డిసెంబర్‌‌లో జూరాలలో సరిపడా సాగు, తాగు నీళ్లు అందుబాటులో ఉండగా.. ఈసారి ఎల్‌ నినో ఎఫెక్ట్‌తో వర్షాల్లేక ఆగస్టులోనే నీటి నిల్వలు తగ్గుముఖం పట్టాయి. యాసంగి పంటకు నీళ్లు ఇవ్వలేని పరిస్థితి నెలకొన్నది. ఎండాకాలం వరకు తాగునీటి అవసరాలు తీర్చడం కూడా కష్టమేనన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. జూరాల నీటిపై గద్వాల, వనపర్తి జిల్లాల్లోని పలు గ్రామాలు, పట్టణాలు ఆధారపడి ఉన్నాయి. ప్రస్తుతమున్న రెండు టీఎంసీలను తాగు నీటి అవసరాలకు వాడుకుంటే.. కేవలం రెండు నెలలు మాత్రమే సరిపోతాయని అధికారులు అంటున్నారు. కర్ణాటక కనీసం 5-10 టీఎంసీలు విడుదల చేస్తేనే తాగునీటి గండం గట్టెక్కే అవకాశముందని, లేదంటే ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు.

రైతుల ఆందోళన..

జూరాలపై ఆధారపడిన కుడి, ఎడమ కాలువలతో పాటు నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్‌ ఎత్తిపోతల పథకాల కింద సాగుకు నీటి విడుదలను అధికారులు నిలిపివేశారు. జూరాల కుడి, ఎడమ కాలువల కింద 34,346 ఎకరాలు, నెట్టెంపాడు కింద 24,800 ఎకరాలు, భీమా కింద 29 వేల ఎకరాలు, కోయిల్‌సాగర్‌ కింద 8 వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. ప్రస్తుతం జూరాలలో నీటి నిల్వలు లేకపోవడంతో యాసంగి పంటలకు ఇచ్చే అవకాశం లేకుండా పోయింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>