ప్రిన్సిపాళ్లు లేరు.. పట్టించుకునేవారూ లేరు!

కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నదని సీఎం రేవంత్‌రెడ్డి పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. విద్యారంగంపై పెట్టేది ఖర్చు కాదని, భవిష్యత్ తరాల కోసం పెట్టే పెట్టుబడి అని వ్యాఖ్యానించారు. వైద్య రంగంలోనూ ఎలాంటి లోపాలకు తావులేకుండా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందాలన్నది ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్రంలో మెడికల్ టూరిజం డెవలప్‌ కావాలని, ఇతర దేశాల నుంచి వచ్చేవారికి సర్వీస్ అందేలా పరిస్థితులు మెరుగుపడాలని వైద్య మంత్రి ఇటీవల ఒక సమీక్ష సందర్భంగా పేర్కొన్నారు.

ఇక బ్లూకాలర్ జాబ్స్ గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు నర్సింగ్ విద్య గురించి సీఎం ప్రస్తావిస్తూ.. ఇతర దేశాల్లో అపారమైన అవకాశాలున్నాయని, వాటిని అందిపుచ్చుకునేలా అక్కడి భాషలను సైతం నేర్పిస్తామన్నారు. ప్రభుత్వ ఆలోచన ఇలా ఉంటే ఆచరణలో మాత్రం భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ పరిధిలో నడుస్తున్న 38 ప్రభుత్వ నర్సింగ్ కళాశాల (Nursing Colleges) లకు రెగ్యులర్ ప్రిన్సిపాళ్లు లేరని, దీంతో పలు రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నది నర్సింగ్ స్టూడెంట్స్ ఆవేదన.

జగిత్యాలలో స్టూడెంట్ సూసైడ్ అటెంప్ట్

జగిత్యాలలోని నర్సింగ్ కాలేజీలో చదువుకున్న విద్యార్థిని ఒకరు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తోటి విద్యార్థులతో పాటు అధ్యాపకుల వేధింపులు ఇందుకు కారణమంటూ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు తన సన్నిహితులకు తెలిపారు. వేధింపుల విషయమై ప్రిన్సిపాల్‌కు, వైస్ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, ఆ తర్వాత వేధింపులు మరింతగా పెరిగాయని, అసభ్య పదజాలంతో దూషించి మానసికంగా వేధించారని వాపోయారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని తోటి విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉంటే..

కళాశాల నిర్వహణపై నర్సింగ్ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయం నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదని, ఫుల్‌టైమ్ ప్రిన్సిపాల్ సైతం లేరని విద్యార్థులు ఆరోపించారు. రెగ్యులర్‌గా ఇన్‌స్పెక్షన్లు చేసినా, విద్యార్థులతో మాట్లాడి సమస్యల గురించి తెలుసుకున్నా, డీఎంఈ నుంచి లేదా నర్సింగ్ డిప్యూటీ డైరెక్టర్ నుంచి పర్యవేక్షణ ఉన్నా ఇలాంటివి విపరీత పరిణామాలకు దారితీసేవి కావన్నది స్టూడెంట్స్ అభిప్రాయం. నర్సింగ్ కౌన్సిల్‌కు ఫుల్‌టైమ్ రిజిస్ట్రార్ గతేడాది రిటైర్ అయిన తర్వాత డిప్యూటీ డైరెక్టర్‌కే ఇన్‌చార్జిగా ఆ బాధ్యతలను అప్పజెప్పారని గుర్తుచేశారు.

నర్సింగ్ కాలేజీలపై ఆదరణ కరువు

టీచింగ్ వ్యవహారాలపై దృష్టి పెట్టాల్సిన మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ సైతం నర్సింగ్ కళాశాలలపై తగిన సీరియస్‌నెస్ పెట్టలేదని, రాష్ట్రంలో 38 నర్సింగ్ కళాశాలలు ఉంటే కేవలం గాంధీ, సంగారెడ్డి కాలేజీల్లో మాత్రమే ఫుల్ టైమ్ ప్రిన్సిపాల్స్ ఉన్నారని, మిగిలిన అన్నీ ఇన్‌చార్జిలతోనే నడుస్తున్నాయని నర్సుల అసోసియేషన్‌ ప్రతినిధి నాయకురాలు ఒకరు వ్యాఖ్యానించారు.

రాష్ట్ర ప్రభుత్వం మెడికల్, నర్సింగ్ కాలేజీలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే అధికారుల ఆచరణ మాత్రం ఆ ఆలోచనకు తగినట్లుగా లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇన్‌చార్జి ప్రిన్సిపాల్స్ స్థానంలో రెగ్యులర్ నియామకాలు చేయాలని, ఇన్‌చార్జి బాధ్యతలకు బదులుగా ఫుల్‌టైమ్ రిజిస్ట్రార్‌ను నియమించాలని, నర్సింగ్ డిప్యూటీ డైరెక్టర్ తరుచూ కళాశాలలను సందర్శించి మౌలిక సౌకర్యాలు, బోధనా పద్ధతులు, విద్యార్థుల సమస్యలు, నిర్వహణలోని ఇబ్బందులపై దృష్టి పెట్టి మెరుగుపరిస్తే ఇలాంటి ఘటనలకు ఆస్కారం లేకుండా చేయొచ్చని అభిప్రాయపడ్డారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>