ఢిల్లీ జట్టులో దాదా, యువీ మార్క్

క‌లం, స్పోర్ట్స్: ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జట్టులో భారీ మార్పులు కనిపిస్తున్నాయి. జట్టు ఆటగాళ్ల రిటెన్షన్, విడుదల నిర్ణయాల వెనుక దిగ్గజాలు సౌరవ్ గంగూలీ, యువరాజ్ సింగ్ ముద్ర స్పష్టంగా ఉందని భారత మాజీ క్రికెటర్ అభినవ్ ముకుంద్ అభిప్రాయపడ్డారు.గత అక్టోబర్‌లో ఢిల్లీ హెడ్ కోచ్‌గా గంగూలీ బాధ్యతలు చేపట్టగా, అసిస్టెంట్ మరియు బ్యాటింగ్ కోచ్‌గా యువరాజ్ సింగ్ జట్టుతో చేరారు. కొత్త మేనేజ్‌మెంట్ ఆలోచనా విధానం పూర్తిగా మారిందని, యువ భారత ఆటగాళ్ల చుట్టూ జట్టును నిర్మించాలని వారు భావిస్తున్నారని ముకుంద్ జియోస్టార్‌తో పేర్కొన్నారు.

ఇటీవల ఢిల్లీ జట్టు 16 మందిని అట్టిపెట్టుకుని, తొమ్మిది మందిని విడుదల చేసింది. ఏడాది క్రితమే జట్టులోకి వచ్చిన నితీష్ రాణా బాగానే ఆడినప్పటికీ, అతని స్థానంలో కుర్ర రక్తాన్ని నింపేందుకే గంగూలీ, యువరాజ్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని ముకుంద్ విశ్లేషించారు. అలాగే ప్రతిభావంతుడైన అభిషేక్ పోరెల్‌ను వదులుకోవడం వెనుక మైదానం వెలుపలి అంశాలు ప్రభావం చూపి ఉంటాయని ఆయన తెలిపారు. మరోవైపు 2027 సీజన్‌కు అందుబాటులో ఉండనని చెప్పిన ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్‌ను వదులుకోవడం సరైన నిర్ణయమేనని ముకుంద్ అన్నారు.

ఈ మార్పుల వల్ల వేలానికి ముందు ఢిల్లీ పర్సులో రూ. 39.50 కోట్ల భారీ మొత్తం మిగిలిందని ఆయన గుర్తుచేశారు.ప్రస్తుతం ఢిల్లీ బ్యాటింగ్ విభాగం చాలా పటిష్టంగా కనిపిస్తోంది. సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ వంటి యువ భారత ఆటగాళ్లకు కొత్త కోచింగ్ బృందం పూర్తి మద్దతుగా నిలుస్తోంది. అయితే శ్రీలంక బ్యాటర్ పాతుమ్ నిస్సాంకను విడుదల చేయడంతో, వేలంలో కేఎల్ రాహుల్‌కు సరికొత్త ఓపెనింగ్ జోడీని ఢిల్లీ వెతుక్కోవాల్సి ఉంటుందని ముకుంద్ అంచనా వేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>