కలం, మహబూబ్ నగర్ బ్యూరో : బాల్య వివాహాల (Child Marriages) నిర్మూలనకు విద్యార్థులు, తల్లిదండ్రులు, సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా (Collector Khushboo Gupta) పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎం.వి.ఎస్. జూనియర్ కళాశాలలో నిర్వహించిన బాల్య వివాహాల నిర్మూలన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. బాల్య వివాహాల వల్ల ముఖ్యంగా బాలికల ఆరోగ్యం, విద్య, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని, చిన్న వయస్సులోనే కుటుంబ బాధ్యతలు మీదపడటంతో వారి ఆశయాలు, లక్ష్యాలు దెబ్బతింటాయని పేర్కొన్నారు.
విద్య, ఆరోగ్యం, వ్యక్తిగత అభివృద్ధితో పాటు ఆర్థిక స్వావలంబన సాధించడంపై విద్యార్థులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా 15 నుంచి 16 ఏళ్లు గల బాలబాలికలకు ఈ వయస్సు జీవితానికి పునాది వేసుకునే కీలక దశ అని, ఈ సమయంలో చిన్నచిన్న ఆకర్షణలు, బహుమతులు, ఇతర వ్యాపకాలతో తమ లక్ష్యాలను విస్మరించకూడదని సూచించారు. వయస్సుకు అనుగుణంగా ఎదురయ్యే ఆకర్షణలను నియంత్రించుకుంటూ చదువు, భవిష్యత్తుపై దృష్టి సారించాలని అన్నారు.
బాల్య వివాహాల కారణంగా బాలికలు చిన్న వయస్సులోనే గర్భం దాల్చితే తల్లి, బిడ్డల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని కలెక్టర్ వివరించారు. వివాహం తర్వాత కుటుంబ బాధ్యతలు, పిల్లల సంరక్షణ వంటి బాధ్యతలు పెరగడంతో విద్యాభ్యాసాన్ని కొనసాగించడం కష్టమవుతుందని తెలిపారు. చట్ట ప్రకారం బాలికలకు 18 ఏళ్లు, బాలురకు 21 ఏళ్లు వివాహానికి కనీస వయస్సు అయినప్పటికీ, ఆ వయస్సు రాగానే వివాహం చేసుకోవాలనే తొందరపడకూడదని సూచించారు. ముందుగా ఉన్నత విద్యను పూర్తి చేసి, ఆర్థికంగా స్వావలంబన సాధించిన తర్వాతే వివాహం గురించి ఆలోచించాలని స్పష్టం చేశారు.
ప్రతి విద్యార్థికి ఉపాధ్యాయులు, వైద్యులు, ఉన్నతాధికారులు, సైనికులు వంటి వివిధ రంగాల్లో స్థిరపడాలనే కలలు ఉంటాయని, బాల్య వివాహాలు ఆ కలలను సాకారం చేసుకోవడానికి అడ్డంకిగా మారతాయని అన్నారు. చిన్న వయస్సులోనే వివాహం చేసుకున్న అనేక మంది మహిళలు విద్యను కొనసాగించలేక, ఆర్థిక స్వాతంత్ర్యం లేక కుటుంబ బాధ్యతలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. బాలుర సైతం చెడు అలవాట్లు, మత్తు పదార్థాలు, ఇతర వ్యసనాలకు దూరంగా ఉంటూ తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని సూచించారు.
తల్లిదండ్రులకు తమపై నమ్మకం కలిగించే బాధ్యత విద్యార్థులపైనే ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత విద్యను అభ్యసించి, మంచి ఉద్యోగాలు సాధిస్తామనే భరోసాను తల్లిదండ్రులకు కల్పించాలని అన్నారు. పిల్లల ప్రవర్తనపై సమాజం నుంచి వచ్చే ఒత్తిళ్లు, అపోహలు, ఇతరుల మాటలకు భయపడి తల్లిదండ్రులు బాల్య వివాహాల వైపు మొగ్గుచూపే పరిస్థితులు రాకుండా విద్యార్థులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
ఇంటర్మీడియట్ పూర్తి చేసిన అనంతరం డిగ్రీలో చేరే దశలో కొంతమంది విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని, కళాశాలలు దూరంగా ఉండటం, తల్లిదండ్రులు ఉన్నత విద్యకు పంపించకపోవడం, వివాహ ఒత్తిళ్లు ఇందుకు ప్రధాన కారణాలవుతున్నాయని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చదువును మధ్యలో ఆపకుండా ఉన్నత విద్యను కొనసాగించాలని విద్యార్థులకు సూచించారు.
ఈ సందర్భంగా జిల్లాలో బాల్య వివాహం నుంచి బయటపడి విద్యను కొనసాగిస్తున్న ఓ బాలిక ఉదంతాన్ని కలెక్టర్ వివరించారు. తనకు బాల్య వివాహం జరిపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని గుర్తించిన ఆ బాలిక చైల్డ్ హెల్ప్‌లైన్ 1098కు ఫోన్ చేసి సమాచారం అందించిందన్నారు. వెంటనే స్పందించిన అధికారులు ఆమెను రక్షించి బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారని తెలిపారు. అనంతరం ఆ బాలిక పదో తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి, ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతోందని పేర్కొన్నారు. బాల్య వివాహాన్ని ధైర్యంగా ఎదుర్కొని విద్యను కొనసాగిస్తున్న ఆ బాలిక ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తోందని అన్నారు.
ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే భయపడకుండా వెంటనే 1098 చైల్డ్ హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాలని విద్యార్థులకు సూచించారు. బాల్య వివాహాల నిర్మూలన బాలికల బాధ్యత మాత్రమే కాదని, బాలురకు కూడా సమాన బాధ్యత ఉందని స్పష్టం చేశారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ గళమెత్తాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని ప్రోత్సహించకూడదని పిలుపునిచ్చారు.
విద్యార్థులు ఖాళీ సమయాన్ని సామాజిక మాధ్యమాలు, ఇతర వ్యర్థ వ్యాపకాలతో వృథా చేయకుండా పుస్తక పఠనం, క్రీడలు, శారీరక వ్యాయామం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లకు కేటాయించాలని సూచించారు. మంచి స్నేహితులను ఎంచుకుని చెడు సాంగత్యానికి దూరంగా ఉండాలని, ఆలోచనలను నియంత్రించుకుంటూ నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు కృషి చేయాలని అన్నారు. ప్రస్తుతం విద్యార్థులు తీసుకునే నిర్ణయాలే రాబోయే 50 ఏళ్ల జీవితాన్ని ప్రభావితం చేస్తాయని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ కీలకమైన వయస్సులో సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. పెద్దలు తమ అనుభవాల ఆధారంగా ఇచ్చే సూచనలను నిర్లక్ష్యం చేయకుండా, వాటి వెనుక ఉన్న ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలని అన్నారు. బాల్య వివాహాలకు పూర్తిగా దూరంగా ఉంటూ, విద్యకు ప్రాధాన్యతనిచ్చి ఉన్నత స్థాయికి ఎదిగి మహబూబ్‌నగర్ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా ఆధికార సంస్థ కార్యదర్శి ఇందిరా, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నరసింహులు, ఎం.వి.ఎస్. జూనియర్ కళాశాల ప్రిన్సిపల్, సంబంధిత అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

