కలం, కరీంనగర్: భూముల హద్దుల విషయంలో భవిష్యత్తులో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా, ప్రతి రైతుకు తన భూమిపై స్పష్టమైన హక్కులు, సరిహద్దుల గుర్తింపు ఉండాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా (Chitra Mishra) పేర్కొన్నారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా చేపట్టిన రీ సర్వే ప్రక్రియలో రైతుల భాగస్వామ్యం కీలకమని తెలిపారు. రామడుగు మండలం చిన్న గోపాలరావుపేట గ్రామంలో రీ సర్వే విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం కలెక్టర్ గ్రామాన్ని సందర్శించి రైతులతో ముఖాముఖి మాట్లాడారు.
రైతులకు కలిగిన ప్రయోజనాలపై ఆరా
రీ సర్వే ప్రక్రియ ఏ విధంగా సాగింది? అధికారులు సర్వే నిర్వహించిన తీరుపై రైతుల అభిప్రాయాలేమిటి? భూముల సరిహద్దుల నిర్ధారణలో ఏవైనా సమస్యలు ఎదురయ్యాయా? అనే అంశాలను కలెక్టర్ రైతులను అడిగి తెలుసుకున్నారు. సర్వే సమయంలో రైతులు అందించిన సహకారం, అధికారుల పనితీరు, భూ వివాదాల నివారణకు ఈ ప్రక్రియ ఏ మేరకు ఉపయోగపడుతుందనే విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. రీ సర్వే నిర్వహణకు అధికారులకు పూర్తిస్థాయిలో సహకరించామని తెలిపారు. తమ భూములకు సంబంధించి కచ్చితమైన హద్దులు నిర్ధారణ కావడంతో ఎంతో సంతృప్తిగా ఉందన్నారు. భవిష్యత్తులో భూ వివాదాలు తలెత్తకుండా ఈ ప్రక్రియ దోహదపడుతుందని, రాబోయే రోజుల్లోనూ అధికారులకు అన్ని విధాలా సహకరిస్తామని కలెక్టర్‌కు వివరించారు.
కొత్త వివాదాలకు చాన్స్ లేకుండా చర్యలు
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీ సర్వే కార్యక్రమం ద్వారా ప్రస్తుత భూ సమస్యల పరిష్కారంతో పాటు భవిష్యత్తులో కొత్త వివాదాలకు అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. చిన్న గోపాలరావుపేటలో 107 ఎకరాల విస్తీర్ణంలో 77 మంది రైతులకు సంబంధించిన రీ సర్వే పూర్తయిందని వెల్లడించారు. గ్రామ రైతులు ఎంతో చక్కగా సహకరించారని అభినందించారు. రీ సర్వే నిర్వహణలో ఈ గ్రామం జిల్లాలోని ఇతర గ్రామాలకు దిక్సూచిగా నిలవాలని ఆకాంక్షించారు.
70 గ్రామాల్లో రీ సర్వేకు కార్యాచరణ
జిల్లాలో మొత్తం 70 గ్రామాల్లో రీ సర్వే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని కలెక్టర్ వివరించారు. ఇప్పటికే అన్ని 70 గ్రామాల్లో గ్రామసభలు పూర్తయ్యాయని తెలిపారు. ఇప్పటివరకు 16 గ్రామాల్లో రీ సర్వే ప్రక్రియ ముగియగా, మరో 28 గ్రామాల్లో పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. మిగిలిన గ్రామాల్లోనూ సర్వేను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తామన్నారు.
31 రోవర్లతో సర్వే.. కొత్తగా మరో 12
రీ సర్వేలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం 31 రోవర్ పరికరాలతో సర్వే నిర్వహిస్తుండగా, తాజాగా మరో 12 రోవర్లు అందుబాటులోకి వచ్చాయని వెల్లడించారు. మండల సర్వేయర్లు, లైసెన్స్‌డ్ సర్వేయర్లు, రెవెన్యూ యంత్రాంగం, సర్వే ల్యాండ్ రికార్డ్స్ బృందాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో రైతులు రీ సర్వే ప్రాధాన్యతను గుర్తించి అధికారులకు సహకరించాలని కలెక్టర్ కోరారు. భూముల హద్దులపై స్పష్టత ఉంటే రైతులకు భరోసా కలుగుతుందని, భవిష్యత్తులో భూ వివాదాల నివారణకు బలమైన పునాది పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) డి.శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవో షర్మిల, ఏడీ సర్వే ల్యాండ్ అండ్ రికార్డ్స్ కిషన్‌రావు, తహసీల్దార్ దాసరి రాజు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.

