‘పల్నాడు’ నీటి తరలింపును అడ్డుకోవాలి: మంత్రి కోమటిరెడ్డి

కలం, నల్గొండ: పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా నాగార్జునసాగర్ నీటిని తరలించే ప్రయత్నాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) పిలుపునిచ్చారు. గురువారం కనగల్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన అనంతరం అధికారులతో మండల కార్యాలయం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ వచ్చిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసమని.. నీటి విషయంలో ఎలాంటి రాజీకి తావులేదని స్పష్టం చేశారు. పల్నాడు ప్రాజెక్టు ఎప్పుడు మొదలైందన్నది ముఖ్యం కాదని, దానిని అడ్డుకోవడమే లక్ష్యమని అన్నారు. అధికారులు సకాలంలో సమాచారం ఇవ్వకపోవడం వల్లే పనులు ముందుకు కదిలాయని, అందుకే అధికారులను మందలించానని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలి..

బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేయకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని వెంకట్ రెడ్డి కోరారు. కేంద్ర నిధులతోనే ప్రాజెక్టు నిర్మిస్తున్నందున కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలని అన్నారు. పైన ఉన్న నీటిని ఎక్కువ చూపించి కిందకు తీసుకెళ్లడం సరైన పద్ధతి కాదని చెప్పారు. జల్ జీవన్ మిషన్ పేరుతో సాగర్ నుంచి 1.38 టీఎంసీల నీటిని తరలించే ప్రయత్నాన్ని ‘జలదోపిడీ’గా అభివర్ణించారు.

పల్నాడు ప్రాజెక్టు రూ.1,200 కోట్లతో, సాగర్ కుడి గట్టున 3 ఇన్‌టేక్ బావులు, 200 ట్యాంకులతో పల్నాడు జిల్లాకు తాగునీటి కోసం 1.86 టీఎంసీల నీటిని తీసుకోవడానికి ఉద్దేశించినది. ఇది కేంద్రం, ఏపీ సంయుక్త నిధులతో జల్ జీవన్ మిషన్ 2.0 కింద చేపడుతున్నారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం నవంబర్ 16న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB)కు లేఖ రాసి అభ్యంతరం తెలిపింది.

2028 నాటికి SLBC టన్నెల్ పూర్తి..

నల్గొండ జిల్లాకు శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC) టన్నెల్‌ను పూర్తి చేసి 2028 ఆగస్టు నాటికి 4 లక్షల ఎకరాలకు రెండు పంటలకు సాగునీరు అందిస్తామని మంత్రి ప్రకటించారు. SLBC టన్నెల్ పనులు 2007లో అమెరికా నుంచి యంత్రాలు తెచ్చి ప్రారంభించారని, అప్పుడు పనులు కొనసాగి ఉంటే రూ.1,000 కోట్లతో రెండేళ్లలో పూర్తయ్యేదని గుర్తుచేశారు. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పనులు తిరిగి ప్రారంభమయ్యాయని, 2028 ఆగస్టు నాటికి పూర్తి చేసి నల్గొండను కరువు రహిత జిల్లాగా చేస్తామని చెప్పారు. బ్రాహ్మణ వెల్లెముల ప్రాజెక్టు ద్వారా నల్గొండ నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని చెప్పుకొచ్చారు. నల్గొండ జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. మళ్లీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందని, వంద సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>