కలం, ఖమ్మం బ్యూరో: బోడేపూడి విజ్ఞాన కేంద్రం (బివికె) ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించే ‘పసిడి మొగ్గల పండుగ బాలోత్సవ్’ (Balotsav 2026) గురువారం ఖమ్మంలోని మంచికంటి మీటింగ్ హాల్‌లో ఘనంగా ప్రారంభమైంది. అర్బన్ ఎంఈవో లక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై వేడుకలను ప్రారంభించగా, నగరంలోని 70 పాఠశాలల నుండి సుమారు వెయ్యి మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పిల్లల్లో సృజనాత్మకత, సామాజిక బాధ్యత, పర్యావరణ స్పృహ పెంపొందించడమే లక్ష్యంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ వై. శ్రీనివాసరావు, కోఆర్డినేటర్ కె. హిమబిందు తెలిపారు. మొత్తం పది అంశాల్లో భాగంగా తొలిరోజు ఉపన్యాసం, శాస్త్రీయ నృత్యం, వ్యాసరచన, డ్రాయింగ్, పాటల పోటీలు జరిగాయి.
చిన్నారుల నృత్యాలు, ఉపన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. రెండో రోజు శుక్రవారం జానపద నృత్యం, బెస్ట్ ఫ్రమ్ వేస్ట్, కథలు చెప్పడం, స్పెల్ బీ, ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు జరుగనున్నాయని, శనివారం విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తామని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో బివికె సభ్యులు వాసిరెడ్డి వీరభద్రం, కళ్యాణం నాగేశ్వరరావు, తుమ్మల వెంకట్రావు, ఎన్. గోవిందరావు, జి. రామారావు, అఫ్జల్‌మియా, సామినేని నాగేశ్వరరావు, ఎస్‌కె ఎండీజాన్, ఎన్. వీరబాబు, ఎం. సుబ్బారావు, టి. శివన్నారాయణ, వి. మోహన్, గుంటుపల్లి శ్రీదేవి, సిహెచ్ వెంకటేశ్వరరావు, వై. రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

