అలుపులేని అమైరా.. ప‌త‌కాల వేట‌లో యంగ్ అథ్లెట్‌!

క‌లం, స్పోర్ట్స్: ట్రాక్‌పై తన వేగంతో ప్రత్యర్థులను వెనక్కి నెట్టేస్తోంది 15 ఏళ్ల అమైరా ఖోస్లా (Amieyra Khoslla). నెల రోజుల వ్యవధిలో మూడు జాతీయ కాంస్య పతకాలు సాధించి అదరగొట్టింది. 60 మీటర్లు, 100 మీటర్లు, 200 మీటర్ల పరుగులో పతకాలు గెలిచి తన సత్తా చాటింది. జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌తో మొదలైన ఆమె పతకాల వేట.. స్కూల్ గేమ్స్‌లోనూ కొనసాగింది. అమైరా తన తొలి పతకాన్ని అక్టోబర్‌లో చెన్నైలో జరిగిన 41వ జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో సాధించింది. అండర్-16 బాలికల 60 మీటర్ల పరుగులో కాంస్యం గెలుచుకుంది. సెమీఫైనల్లో 7.74 సెకన్లతో ఈ ఈవెంట్‌లోనే అత్యంత వేగవంతమైన టైమింగ్ నమోదు చేసింది. ఫైనల్లో మూడో స్థానంలో నిలిచి పతకం అందుకుంది.

అదరగొట్టిన అమైరా

నవంబర్ 19 నుంచి 23 వరకు మధ్యప్రదేశ్‌లోని శివపురిలో జరిగిన 70వ ఎస్జీఎఫ్ఐ జాతీయ స్కూల్ గేమ్స్‌లో అమైరా మరో రెండు పతకాలు సాధించింది. అండర్-17 విభాగంలో తనకంటే పెద్ద వయసు అథ్లెట్లతో పోటీపడింది. 100 మీటర్ల పరుగును 12.07 సెకన్లలో పూర్తి చేసి కాంస్యం గెలిచింది. 200 మీటర్లలో 24.71 సెకన్ల టైమింగ్‌తో మరో కాంస్యం ఖాతాలో వేసుకుంది. సెమీఫైనల్లో 24.69 సెకన్లతో పరుగెత్తింది. 200 మీటర్లలో ఆమె నమోదు చేసిన టైమింగ్.. ఢిల్లీ విద్యాశాఖ గతంలో ప్రచురించిన అండర్-19 స్కూల్ అథ్లెటిక్స్ బెంచ్‌మార్క్ 24.97 సెకన్ల కంటే మెరుగ్గా ఉంది. అయితే, దీన్ని కొత్త రికార్డుగా ప్రకటించలేదు.

ట్రాక్‌పై వేగాన్ని ప్రదర్శించడం తనకు ఎంతో ఇష్టమని అమైరా తెలిపింది. స్పోర్ట్ క్లైంబింగ్‌లోనూ అదే వేగాన్ని ఆస్వాదిస్తానని చెప్పింది. ఢిల్లీ రాష్ట్ర జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ నుంచి మొదలైన గత కొన్ని వారాలు ఎంతో గుర్తుండిపోయాయని పేర్కొంది. తన ప్రదర్శన వెనుక కోచ్, మాజీ భారత స్ప్రింటర్ అమిత్ ఖన్నా మార్గదర్శకత్వం ఉందని తెలిపింది. ఆయన అనుభవం, శిక్షణ తనకు ఎంతో ఉపయోగపడ్డాయని కృతజ్ఞతలు చెప్పింది.

ఇంతకుముందు జూలైలో ఇటలీలో జరిగిన వరల్డ్ యూత్ క్లైంబింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ తరఫున పాల్గొని ఆరో స్థానం సాధించింది. డిసెంబర్‌లో హైదరాబాద్‌లో జరగనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో పాల్గొనాలని భావించినా, గత ఏడాది ఎస్జీఎఫ్ఐ పోటీల ప్రదర్శన ఆధారంగా ఎంట్రీలు నిర్ణయించడంతో ఆమెకు అవకాశం దక్కలేదు. అయినప్పటికీ, తొందరపడకుండా తనకు ఇష్టమైన ఆటలో ముందుకు సాగాలని తల్లిదండ్రులు అమృత, వినయ్ ప్రోత్సహిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>