కలం, జగిత్యాల: రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో కండ్లపల్లి (Kandlapally) మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజీ విద్యార్థిని ప్రతిభ చాటింది. కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ (స్కూల్ గేమ్స్ ఫెడరేషన్) అండర్-17 బాలికల బాస్కెట్బాల్ పోటీల్లో పదో తరగతి విద్యార్థిని పి. రోహిత అద్భుత ప్రతిభ కనబరిచి పాఠశాలకు గుర్తింపు తీసుకువచ్చింది. రాష్ట్రస్థాయి పోటీల్లో తన క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించిన రోహితను పాఠశాల ప్రిన్సిపల్ డి. సరితా దేవి, వైస్ ప్రిన్సిపల్ కె. నాగేష్ అభినందించారు. విద్యార్థినిలోని క్రీడా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడంలో ఉపాధ్యాయులు, పీడీల కృషి అభినందనీయమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పీడీలు అజీమ్, వినీత్తో పాటు ఉపాధ్యాయ బృందం రోహితను అభినందించి, భవిష్యత్తులో మరిన్ని క్రీడా పోటీల్లో పాల్గొని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యతనిస్తూ విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసేందుకు పాఠశాల ఉపాధ్యాయ బృందం చేస్తున్న కృషికి ఈ విజయం నిదర్శనమని తెలిపారు. రోహిత సాధించిన ప్రతిభ పాఠశాల విద్యార్థులకు స్ఫూర్తినిస్తుందని అన్నారు.

