కలం, ఖమ్మం బ్యూరో: జిల్లాలో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పోడు భూములన్నింటికీ తక్షణమే అటవీ హక్కుల పట్టాలు ఇవ్వాలని, గిరిజన, గిరిజనేతరుల సాగు భూములపై అటవీ అధికారుల దాడులను, కందకాలు తవ్వడాన్ని వెంటనే నిలిపివేయాలని సీపీఐ అనుబంధ భారత ఖేత్ మజ్దూర్ యూనియన్ (BKМU) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి రేసు ఎల్లయ్య డిమాండ్ చేశారు.
వ్యవసాయ కార్మికులు, నిరుపేదల సమస్యల పరిష్కారం కోరుతూ బీకేఎంయూ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట భారీ ఎత్తున ధర్నా, ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. తొలుత ధర్నా చౌక్ నుంచి కలెక్టరేట్ గేట్ వరకు నిరుపేదలు, కార్మికులు భారీ ప్రదర్శనగా కదం తొక్కారు. ఈ సందర్భంగా రేసు ఎల్లయ్య మాట్లాడుతూ, సాగు చేస్తున్న అటవీ హక్కుల పట్టా భూములకు త్రీఫేజ్ విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరారు.
గ్రామీణ పేదల ఉపాధిని దెబ్బతీసే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్రలను తిప్పికొడతామని, కూలీల పొట్టకొట్టే విధానాలపై రాజీలేని పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) యథావిధిగా కొనసాగిస్తూ, ‘వి బి జి రామ్ జి’ పథకాన్ని తక్షణమే రద్దు చేయాలన్నారు. ఉపాధి పని దినాలను 100 నుంచి 200 రోజులకు పెంచి, దినసరి వేతనం రూ.700 చెల్లించాలని, రోజుకు రెండు పూటల హాజరు విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా వృద్ధాప్య పెన్షన్ రూ.4 వేలు, మహిళలకు నెలకు రూ.2,500 అందించాలని, ఇంటి స్థలాలు లేని నిరుపేదలకు స్థలాలతో పాటు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. ప్రభుత్వ హామీల అమలుకు ఉద్యమాలే శరణ్యమని, నిరుపేదలకు అండగా ఎర్రజెండా నిరంతరం పోరాడుతుందని పేర్కొన్నారు. ధర్నాలో బీకేఎంయూ (BKМU) జిల్లా అధ్యక్షులు వి. పూర్ణచందర్, సంఘం నిర్మాణ బాధ్యులు సయ్యద్ సలీం, నాయకులు సరెడ్డి పుల్లారెడ్డి, వీసంశెట్టి పద్మజ, దుగ్గిరాల సుధాకర్, బాస శ్రీనివాస్, జంగం మోహన్ రావు, తదితరులు పాల్గొన్నారు.

