కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: చరిత్రపుటల్లో బందిపోటుగా అభివర్ణించినా.. బడుగు, బలహీన వర్గాల హృదయాల్లో పండుగ సాయన్న (Panduga Sayanna) చెరగని ముద్ర వేశారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా గండేడ్ మండలం కొమ్మిరెడ్డిపల్లిలో పండుగ సాయన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాబిన్ హుడ్‌గా పేరుగాంచిన పండుగ సాయన్న జీవితం యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన ఆచరించిన మార్గాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
పండుగ సాయన్న ఆనాడే పేదల పక్షాన పోరాడిన యోధుడు అని, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి సబ్బండ వర్గాల ప్రజలను ఏకతాటిపై నిలిపిన సాయన్న విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో గర్వంగా ఉందని పేర్కొన్నారు. పండుగ సాయన్న గురించి ఎవరు ఎంత చెడుగా ప్రచారం చేసినా ఆయన జీవితం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అంకితమైందన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

