కలం, వెబ్ డెస్క్: తమిళనాడులో విజయ్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. సుప్రీం కోర్టు, మద్రాస్ హై కోర్టులు ఆదేశించినా మధురైలోని తిరుప్పరంకుండ్రం (Thiruparankundram) కొండపై దీపం వెలిగించేందుకు నో చెప్పింది. దీంతో దీపం వెలిగించే దీపతూన్ స్తంభంపై కాకుండా కొద్ది దూరంలో ఉన్న ఉచ్చిపిళ్లయార్ ఆలయంలో దీపం వెలిగించారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు, హిందూ సంఘాలు కొండ కింద ఉన్న మురుగన్ ఆలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. వెంటనే దీపతూన్ స్తంభంపై దీపం వెలిగించాలని డిమాండ్ చేశారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఘర్షణ నెలకొంది. విజయ్ ప్రభుత్వం ప్రజల నమ్మకాలతో ఆడుకుంటోందని బీజేపీ ముఖ్య నేత తమిళి సై సౌందర్ రాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కచ్చితంగా కోర్టు ధిక్కరణ చర్య అవుతుందని స్పష్టం చేశారు.
సుప్రీం కోర్టులో పిటిషన్..
సుప్రీం కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించిన విజయ్ ప్రభుత్వంపై కోర్టు ధిక్కరణ పిటిషన్ వేస్తామని లాయర్ రమా రవికుమార్ స్పష్టం చేశారు. కోర్టులోనే తేల్చుకుంటామని స్పష్టం చేశారు. మధురైలోని మద్రాస్ హై కోర్టు బెంచ్ కూడా దీపం వెలిగించాలని ఆదేశించినా.. విజయ్ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు కోర్టు దృష్టికి తీసుకెళ్తామని వివరించారు. ఇదిలా ఉంటే.. తిరప్పరంకుండ్రం దీపం వివాదం విజయ్ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగిస్తుందని పరిశీలకులు చెబుతున్నారు.

