కలం, స్పోర్ట్స్: అమెరికా యువ టెన్నిస్ స్టార్ బెన్ షెల్టన్ (Ben Shelton) తన కోచింగ్ బృందాన్ని మరింత బలోపేతం చేసుకున్నాడు. స్పెయిన్ దిగ్గజ కోచ్ జువాన్ కార్లోస్ ఫెర్రెరోను తన జట్టులోకి తీసుకున్నాడు. గతేడాది డిసెంబర్లో కార్లోస్ అల్కరాజ్తో ఆరేళ్ల బంధం ముగిసిన తర్వాత, ఫెర్రెరో 2026లో ఎక్కువ కాలం కోచింగ్‌కు దూరంగా ఉన్నారు. తనకు ఎన్నో ఆఫర్లు వచ్చినా మనసు ఒప్పుకోలేదని, కానీ షెల్టన్ కళ్లలో గెలవాలనే కసిని చూశాక మళ్లీ కోచ్‌గా మారాలనే ఆసక్తి కలిగిందని ఫెర్రెరో పేర్కొన్నారు. 24 ఏళ్ల బెన్ షెల్టన్‌కు 2026 సీజన్ కెరీర్లోనే అత్యుత్తమంగా నిలిచింది.
ఈ ఏడాది అతను ఏకంగా నాలుగు టైటిళ్లను కైవసం చేసుకున్నాడు. ముందుగా డల్లాస్ ఓపెన్ గెలిచి, ఆ తర్వాత మ్యూనిచ్ క్లే కోర్టులో విజేతగా నిలిచాడు. వింబుల్డన్‌కు ముందు స్టట్గార్ట్ గ్రాస్ కోర్టు టోర్నీతో పాటు, కెనడా మాస్టర్స్ టైటిల్‌ను కూడా నిలబెట్టుకున్నాడు. అయితే, యూఎస్ ఓపెన్‌లో షెల్టన్ తన అసలు సత్తా చాటాడు. క్వార్టర్ ఫైనల్లో అల్కరాజ్పై నాలుగు గంటల 28 నిమిషాల పాటు పోరాడి సంచలన విజయం సాధించాడు. ఆ తర్వాత సెమీస్‌లో టియాఫోను ఓడించి తొలిసారి గ్రాండ్ స్లామ్ ఫైనల్ చేరాడు.
తుది పోరులో అలెగ్జాండర్ జ్వెరెవ్ చేతిలో ఓడిపోయాడు. ఈ ఏడాది తొలి సెట్ కోల్పోయిన తర్వాత ఏకంగా 16 మ్యాచ్‌లలో గెలిచి షెల్టన్ తన పోరాట పటిమను నిరూపించుకున్నాడు. యూఎస్ ఓపెన్ ఫైనల్ ఓటమి తర్వాత తన ఆటలో మరిన్ని మెలకువలు నేర్చుకోవాలని షెల్టన్, అతని తండ్రి బ్రయాన్ భావించారు. అందుకు ఫెర్రెరో సరైన వ్యక్తి అని నిర్ణయించుకున్నారు. గతంలో అల్కరాజ్ను ప్రపంచ నంబర్ వన్‌గా తీర్చిదిద్ది, ఆరు గ్రాండ్ స్లామ్‌లు గెలవడంలో ఫెర్రెరో కీలక పాత్ర పోషించారు. ఇటీవల ట్యూరిన్‌లో జరిగిన ఏటీపీ ఫైనల్స్‌లో వీరిద్దరూ తొలిసారి కలిసి పనిచేశారు. ఆ టోర్నీలో షెల్టన్ సెమీఫైనల్ వరకు చేరుకున్నాడు.

