కలం, వెబ్‌డెస్క్: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల భద్రతకు పెద్దపీట వేస్తూ టీటీడీ (TTD) శ్రీవారి యాత్ర సురక్ష (Srivari Yatra Suraksha) పేరిట బీమా పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది సెప్టెంబర్ 9 నుంచి ఈ పథకం అమలులోకి వచ్చింది. ఇందులో భాగంగా తిరుమల యాత్రలో భక్తులు సహజంగా మరణిస్తే రూ. 2 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందజేస్తారు. ఆలయాల్లో దేశంలోనే తొలిసారిగా టీటీడీ ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద సెప్టెంబర్ 20 నుండి అక్టోబర్ 26 మధ్య తిరుమల యాత్రలో సహజంగా మరణించిన ఏడుగురు భక్తుల కుటుంబ సభ్యులకు నేడు టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర రూ.2 లక్షల చొప్పున బీమా చెక్కులను అందించారు.
ముందుగా దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న వారికే కాకుండా, నేరుగా సర్వదర్శనం కోసం వచ్చే భక్తులందరికీ ఈ బీమా సదుపాయం వర్తిస్తుంది. టికెట్లు లేని భక్తులు క్యూలైన్లలోకి ప్రవేశించగానే కమాండ్ కంట్రోల్ సెంటర్ సాంకేతికత ద్వారా వారిని గుర్తించి ఆటోమేటిక్‌గా బీమా పరిధిలోకి చేరుస్తారు. భక్తులతో పాటు తిరుమలలో నిస్వార్థంగా సేవలందించే శ్రీవారి సేవకులకు కూడా ఈ రక్షణ కల్పించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

