కలం, కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎంతో ప్రాధాన్యత కలిగిన పవిత్రమైన రోజు నవంబర్ 29 అని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ (MLA Gangula Kamalakar) పేర్కొన్నారు. రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పిందని, ఆ చారిత్రాత్మక ఘట్టానికి వేదికైన అలుగునూరులో ఈనెల 29న దీక్షా దివస్‌ను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా శనివారం అలుగునూరులో దీక్షా దివస్ సభ నిర్వహించనున్న ప్రదేశాన్ని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, ఎమ్మెల్యే సంజయ్, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తదితర నాయకులతో కలిసి గంగుల పరిశీలించారు.
దీక్షకు బయలుదేరిన కేసీఆర్..
అనంతరం మీడియాతో గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. 2009 నవంబర్ 29న తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు బయలుదేరడం తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఒక సంచలన ఘట్టమని గుర్తుచేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చకుండా కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుందని విమర్శించారు. 1969లో తెలంగాణ ప్రజలు చేసిన ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చకుండా మోసం చేసిన కాంగ్రెస్, మరోసారి తెలంగాణ ప్రజలను మోసం చేస్తుందనే ఆవేదనతో కేసీఆర్ నిరాహార దీక్షకు పూనుకున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమై కేసీఆర్ దీక్షకు బయలుదేరారని పేర్కొన్నారు.
అరెస్టుతో ఉద్యమం మలుపు…
కేసీఆర్ దీక్షకు బయలుదేరిన క్రమంలో అలుగునూరు ప్రాంతంలో ఆయనను అరెస్టు చేయడం తెలంగాణ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసిందని గంగుల కమలాకర్ అన్నారు. కేసీఆర్ అరెస్టుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, విద్యార్థులు, యువత, ఉద్యమకారులు పెద్దఎత్తున రోడ్లపైకి వచ్చి ఉద్యమించడంతో కేంద్ర ప్రభుత్వం స్పందించక తప్పలేదని పేర్కొన్నారు. ప్రజల ఉద్యమ ఒత్తిడితోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై కేంద్రం ప్రకటన చేసిందని, ఆనాడు కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకోకపోతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమయ్యేది కాదని అభిప్రాయపడ్డారు.
పార్టీ కార్యక్రమం కాదు..
దీక్షా దివస్ అనేది కేవలం బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమం మాత్రమే కాదని, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించిన చారిత్రాత్మక దినమని గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసిన పోరాటం, ఉద్యమంలో ఎందరో చేసిన త్యాగాలు, తెలంగాణ సాధన వెనుక ఉన్న చరిత్రను నేటి చిన్నారులకు, భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం, ఈ గడ్డపై గాలి ఉన్నంతకాలం దీక్షా దివస్ కార్యక్రమాన్ని పవిత్ర దినంగా, ఘనంగా నిర్వహిస్తామని గంగుల కమలాకర్ ప్రకటించారు. దీక్షా దివస్ సభకు కవులు, కళాకారులు, తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులు, ఉద్యమకారులు, వివిధ వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారని తెలిపారు.
కేటీఆర్ రాక.. సభకు భారీ ఏర్పాట్లు
దీక్షా దివస్ సభకు పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఆహ్వానిస్తున్నామని గంగుల కమలాకర్ తెలిపారు. కేటీఆర్ హాజరయ్యే నేపథ్యంలో సభను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నామని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో పాటు పార్టీ ముఖ్య నేతలు సమన్వయంతో సభా ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు.
మరో నాలుగైదు రోజుల్లో ఏర్పాట్లు పూర్తి చేస్తామని, వేలాది మంది ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, వాహనాల పార్కింగ్, సభా ప్రాంగణం, ఇతర అవసరమైన సదుపాయాలను కల్పిస్తామని పేర్కొన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు, నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్, మాజీ జిల్లా పరిషత్ ఛైర్మన్ తుల ఉమ, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.

