కలం, నిర్మల్: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని (Indiramma Family Life Insurance) ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Bhavesh Mishra) అన్నారు. శనివారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని గొల్లపేట్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ లో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా శిబిరాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బీమా నమోదు తీరును పర్యవేక్షించారు. ఒక కుటుంబానికి బీమా నమోదు చేయడానికి దాదాపు ఎంత సమయం అవుతుందో స్వయంగా పరిశీలించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా బీమా నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని అన్నారు.
స్థానిక అధికారులంతా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం శిబిరాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. ప్రజలంతా ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం కింద నమోదయ్యేలా చొరవ చూపాలని తెలిపారు. ఈ పథకంపై ప్రజలకు ఎలాంటి సందేహాలు ఉన్న వారికి అర్థమయ్యేలా తెలియజేయాలని అన్నారు. ప్రక్రియ పూర్తి చేసిన కుటుంబాల వివరాలన్నీ స్పష్టంగా నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ తనిఖీలో సీపీఓ గంగారెడ్డి, మున్సిపల్ కమిషనర్ రవిబాబు, స్థానిక కౌన్సిలర్ సురేష్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

