కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 4,76,932 మంది లబ్ధిదారులు ‘చేయూత’ పింఛన్ల (Cheyutha Pension) జాబితాలో చేరారు. దీంతో మొత్తం లబ్ధిదారుల సంఖ్య 44,49,767కు (నవంబరు 19 నాటికి) చేరుకున్నది. కొత్తగా చేరిన లబ్ధిదారులను గమనంలోకి తీసుకున్న ప్రభుత్వం ఆర్థిక శాఖ నుంచి వెయ్యి కోట్లను పంచాయతీరాజ్ శాఖలోని ‘సెర్ప్’ విభాగానికి బదిలీ చేసింది. ప్రభుత్వం లాంఛనంగా కొత్త లబ్ధిదారుల్లో కొందరికి ‘చేయూత’ సాయాన్ని ఈ నెల 26న ‘రాజ్యాంగ దినోత్సవం’ రోజున నమూనా చెక్కుల ద్వారా అందజేయనున్నది.
వీరందరికీ బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. కొత్తగా చేరిన లబ్ధిదారుల్లో హెచ్ఐవీ, పైలేరియా, తలసేమియా, డయాలసిస్ పేషెంట్లు కూడా ఉన్నారు. కొత్తగా చేరిన లబ్ధిదారుల్లో అత్యధికంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, నల్లగొండ జిల్లాలకు చెందినవారు ఉన్నారు. కేటగిరీవారీగా చూస్తే వితంతు పెన్షన్లు అందుకుంటున్నవారే సగం మంది. ఆ తర్వాతి స్థానంలో దివ్యాంగులు ఉన్నారు. ‘ఇందిరమ్మ చీరల’ పంపిణీతో పాటే ‘చేయూత’ పింఛన్ల మంజూరు ప్రోగ్రామ్ కూడా జరగనున్నది.
వృద్ధులు, వితంతువులే ఎక్కువ..
‘చేయూత’ పెన్షన్లు అందుకుంటున్న మొత్తం 44,49,767 మందిలో సగానికి పైగా వృద్ధాప్య, వితంతు మహిళా లబ్ధిదారులే. జిల్లాలవారీగా లెక్కలోకి తీసుకుంటే అత్యధికంగా నిజామాబాద్ 2.81 లక్షల మంది, హైదరాబాద్లో 2.75 లక్షలు, జగిత్యాలలో 2.31 లక్షలు, నల్లగొండలో 2.15 లక్షలు, రంగారెడ్డిలో 2.09 లక్షలు చొప్పున ఉన్నారు. మొత్తం 44.49 లక్షల మంది ‘చేయూత’ పింఛనుదారుల్లో వృద్ధాప్య కేటగిరీలో 16.37 లక్షలు, వితంతు కేటగిరీలో 15.73 లక్షలు, ఒంటరి మహిళల కేటగిరీలో 1.44 లక్షల మంది చొప్పున ఉన్నారు.
వితంతు మహిళల లబ్ధిదారులు ఎక్కువగా హైదరాబాద్లో (1.12 లక్షలు) ఉంటే ఆ తర్వాతి స్థానంలో రంగారెడ్డి జిల్లాలో 86 వేలు, నల్లగొండ జిల్లాలో 83 వేలు, ఖమ్మంలో 73 వేల చొప్పున ఉన్నారు. ఒంటరి మహిళల కేటగిరీలో సైతం అత్యధికంగా హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లోనే ఉన్నారు. ఈ రెండు కేటగిరీల్లో కొత్తగా చేరుతున్న పింఛనుదారుల్లోనూ ఎక్కువగా హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మల్కాజిగిరి, నిజామాబాద్ జిల్లా లబ్ధిదారులే ఉన్నారు.

