కలం, మునుగోడు : చండూరు మున్సిపాలిటీ ( Chandur Municipality) పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని శుక్రవారం చండూరులోని పీఆర్ గెస్ట్ హౌస్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు మంజూరైన చేయూత పెన్షన్ ప్రొసీడింగ్స్‌ను మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ ఎల్. మల్లేశం, పాలకవర్గ సభ్యుల చేతుల మీదుగా అందజేశారు.
ముందుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పెన్షన్ మంజూరు పత్రాలను స్వీకరించి, అనంతరం పీఆర్ గెస్ట్ హౌస్‌లో నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం, కుటుంబాల ఆర్థిక భద్రతను దృష్టిలో ఉంచుకొని ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. కుటుంబాన్ని పోషించే పెద్ద వ్యక్తి మరణించిన సందర్భంలో అర్హులైన కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా ఆర్థిక సహాయం అందించడం ద్వారా ఆ కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
బీమా పథకం ముఖ్య వివరాలివే:
కుటుంబాన్ని పోషించే 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు గల సభ్యుడిని బీమా పొందే వ్యక్తిగా ప్రతిపాదిస్తారు. వయస్సు ధ్రువీకరణకు ఆధార్ కార్డు ప్రతిని ప్రామాణికంగా తీసుకుంటారు. బీమా పొందిన వ్యక్తి మరణిస్తే నామినీకి రూ.5 లక్షల బీమా పరిహారం అందజేస్తారు. ఒకరి కంటే ఎక్కువ మంది నామినీలను నమోదు చేసుకునే అవకాశం ఉండగా, వారికి అందాల్సిన వాటాలను శాతాల వారీగా పేర్కొనాలి. ఈ పథకానికి సంబంధించిన బీమా ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. లబ్ధిదారులు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు.
అర్హులైన కుటుంబాలు అవసరమైన రేషన్ కార్డు, ఆధార్ కార్డులతో సంబంధిత వార్డు క్యాంపులకు హాజరై దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుల స్వీకరణ గడువు 2026 నవంబర్ 19 నుంచి డిసెంబర్ 18 వరకు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎల్. మల్లేశం, కౌన్సిలర్లు తెలుకుంట్ల రాజకుమారి చంద్రశేఖర్, బుషిపాక వాసు, సామ సుజాత యాదవ రెడ్డి, జెల్ల ధనమ్మ శ్రీనివాస్, కొన్రెడ్డి మధు, కో-ఆప్షన్ సభ్యులు మొగుదాల సత్తమ్మ వెంకన్న, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, పట్టణ ప్రజలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

